- దానంపై పెండింగ్ కేసు తేలేదాక ఎన్నిక జరపవద్దని కోర్టుకెళ్లా: విజయా రెడ్డి
- రేవంత్ రెడ్డి తనతో కేసు వేయించారన్న ప్రచారం అబద్ధమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దానం నాగేందర్‌పై తాను వేసిన కేసు పెండింగ్‌లో ఉన్నందున, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక నిర్వహించవద్దని కోర్టును ఆశ్రయించానని అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయా రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. 2023లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డాడని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో దానం.. మహిళా ఓటర్లకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు చెప్పారు.
అందుకే ఎమ్మెల్యేగా గెలిచిన దానంను అనర్హుడిగా ప్రకటించి, ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆ ఎన్నికల్లో గెలిచినట్లు ప్రకటించాలని కోర్టును కోరినట్లు ఆమె తెలిపారు. ఆ కేసు ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని, ఆ తీర్పు వచ్చే వరకు ఉప ఎన్నిక నిర్వహించవద్దని, దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నట్లు కోర్టుకు వెల్లడించారు. అయితే.. ఉప ఎన్నికలో గెలవలేక సీఎం రేవంత్ రెడ్డి తనతో కేసు వేయించినట్లు కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ఈ కేసుతో రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆయన సీఎం అయ్యాక జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తూ వస్తుందని, ఈ ఎన్నికలో కూడా కాంగ్రెస్‌కే గెలిచే అవకాశం ఉందన్నారు. ఖైరతాబాద్‌కు ఎప్పడు ఉప ఎన్నిక వచ్చినా ఎదుర్కొంటామని, పక్కా గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
