నాకు బీపీ, షుగర్ ఉన్నాయి.. ప్లీజ్ గెలిపించండి 

నాకు బీపీ, షుగర్ ఉన్నాయి.. ప్లీజ్ గెలిపించండి 

చెన్నై: తమిళనాడులో పొలిటికల్ వాతావరణం హీటెక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్ల మనసులు గెలిచేందుకు నాయకులు పాట్లు పడుతున్నారు. కొందరు నేతలు హామీలు ఇస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తుండగా.. మరికొంత మంది నాయకులు తమపై జాలి చూపించాలని ఓటర్లను కోరుతున్నారు. తాజాగా తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ చేసిన ఎన్నికల ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. తనకు బీపీ, షుగర్ ఉన్నాయని.. కాబట్టి గెలిపించే బాధ్యత ప్రజల మీదే ఉందని క్యాంపెయిన్‌‌లో విజయ్ భాస్కర్ అనడం గమనార్హం. 

విజయ్ భాస్కర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తి హెల్త్ మినిస్టర్ ఎలా అయ్యాడంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒక హెల్త్ మినిస్టర్ అయ్యుండి అనారోగ్య సమస్యలను గుర్తు చేస్తూ తనను ఆదరించాలని అడగడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై వివాదం రేగడంతో విజయ్ భాస్కర్ స్పందించారు. తానేమీ సెంటిమెంట్ ఓట్ల కోసం పాకులాడటం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను ఓట్ల కోసం అభ్యర్థించాల్సిన అవసరం లేదని.. తన ముఖం చూసే ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పారు.