మీ మనసులో ఉన్న రాహుల్ గాంధీని చంపేశా: రాహుల్ గాంధీ

మీ మనసులో ఉన్న రాహుల్ గాంధీని చంపేశా: రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ నిర్విరామరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మీ మనసులో ఉన్న రాహుల్ గాంధీని చంపేశానంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తానిచ్చిన సమాధానంతో ఎవరూ ఆశ్చర్యపోవద్దని, తానేం చెప్పానో అర్థం చేసుకునేందుకు హిందూయిజం, శివుడి గురించి చదవాలని రాహుల్ సలహా ఇచ్చారు. భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని ఈ యాత్ర మీ ఇమేజ్‌ను ఎలా మార్చిందని అడిగిన ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.

"నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాలేదు కదూ! ఇతను రాహుల్ గాంధీ కాదు. హిందూ ధర్మం గురించి కొద్దిగా చదవండి. శివుడి గురించి కూడా కొంత చదవండి. నేనేం చెప్పానో అప్పుడు అర్థమవుతుంది. ఆశ్చర్యపోకండి. రాహుల్ గాంధీ మీ మనసుల్లో ఉన్నాడు. కానీ, నా మనసులో లేడు. రాహుల్ బీజేపీ మనసులో ఉన్నాడు. నా మనసులో లేడు’’ అంటూ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. తనకు ఇమేజ్‌తో సంబంధం లేదని, దానిపై తనకు అంత ఆసక్తి కూడా లేదని రాహుల్ స్పష్టం చేశారు. ఆ ఇమేజ్‌ను మీరు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి.. అది మంచిదైనా, చెడ్డదైనా మీదేనన్నారు. కానీ, అది తనది కాదని పేర్కొన్నారు. దానివల్ల తనకొచ్చేదేమీ లేదన్న రాహుల్... తన పని తాను చేసుకుంటూ పోతానని రాహుల్ వివరించారు.