నిజామాబాద్, వెలుగు: ‘నేను బీజేపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం, మతిలేని వారే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ లీడర్లెవరితో నాకు విబేధాలు లేవు, ఎవరికి వ్యతిరేకంగా ఎక్కడా లెటర్లు ఇవ్వలేదు’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. నిజామాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ ఫలితాలు స్టేట్‌లో టాప్ ప్లేస్ సాధించాయని, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఈ రిజల్ట్ వస్తుందా? అని ప్రశ్నించారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డిని పాలిటిక్స్‌లోకి తెచ్చింది తానే అయినా.. ఆయన సమర్థతతో రాష్ట్ర రాజకీయాల్లో ఐకాన్‌గా మారారని, భవిష్యత్‌లో మరింత ఉన్నతంగా ఎదుగుతారన్నారు. ఎంపీగా తనకు ఎక్కడా కోటరీలు లేవని, ఎమ్మెల్యేగా పైడి రాకేశ్‌రెడ్డి కొత్త, పాత క్యాడర్‌ను కలుపుకొని వెళ్లాలని మాత్రమే సూచించానన్నారు. చిన్నపాటి విబేధాలు అంతటా సహజమే దానిని మరో రకంగా ప్రచారం చేసి జుట్టు పీక్కోవద్దని సూచించారు.
పార్టీని నడిపించి, అధికారంలోకి తెచ్చే అలవాటున్న కుటుంబం నుంచి వచ్చినవాడ్ని ఇప్పుడు నా ఫోకస్ అంతా దానిపైనే ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీసీలకు మేలు చేసే మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా పని చేసిందన్నారు. నిజానికి ఎక్కడెక్కడి వాళ్లో ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నారని, కొత్త పార్టీ పెడుతున్న కవిత సైతం బీసీలంటున్నారు అని ఎద్దేవా చేశారు. మూడు దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మోదీ నాయకత్వంలో ముగింపు రానుందన్నారు.
గ్రామ పంచాయతీలకే పరిమితమైన మహిళల ప్రాతినిథ్యం పార్లమెంట్ దాకా విస్తరించనుందన్నారు. 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లతో పాటు సెగ్మెంట్ల డీలిమిటేషన్ సైతం జరుగనుందని, దీని వల్ల దేశంలో పార్లమెంట్ స్థానాల సంఖ్య 816కు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో 26 సెగ్మెంట్స్ ఏర్పడుతాయన్నారు. ఈ అంశంలో తెలంగాణకు నష్టం జరుగుతున్నట్లు కాంగ్రెస్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్, స్రవంతిరెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
