ఆకలితో నైనా చస్తాం కానీ.. ఆత్మ గౌరవం పోగొట్టుకోము

ఆకలితో నైనా చస్తాం కానీ.. ఆత్మ గౌరవం పోగొట్టుకోము
  • రాజ్యాంగాన్ని రద్దు చేయాలని  ప్రగతి భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆకలితో నైనా చస్తాం కానీ.. ఆత్మ గౌరవం పోగొట్టుకోము.. కేసీఆర్ కుట్రలు భరించలేకే ప్రజల మధ్య ఉంటున్నానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాలులో విశ్వ కర్మీయుల పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ‘చలో సిరిసిల్ల’ ఆత్మగౌరవ జిల్లా సదస్సులో ఆర్ఆఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు నాగరికతలో పని ముట్లు ఇచ్చింది విశ్వ కర్మలేనని గుర్తు చేశారు. సిరిసిల్లలో సభ వద్దంటూ పోలిసుల నుండి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన .. గడిల పాలన అక్కడి నుండే కొనసాగుతోందని విమర్శించారు.

నేను 26 ఏళ్ల పాటు పోలీసు అధికారిగా పని చేశా... మీ నాయన కెసిఆర్ పెట్టే కుట్రలు భరించలేక బయటకు వచ్చి ప్రజల మధ్యలో ఉంటున్న...ఈనాడు  సిరిసిల్ల ఒక్కటే కాదు.. మొత్తం తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అమెరికాలో కేటీఆర్ నేర్చుకుంది ఇదేనా.. కేటీఆర్ కి అహంకారం ఎక్కడి నుండి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేవలం ఒక్క శాతం ఉన్నోళ్లు మనల్ని శాసిస్తున్నారని ఆయన విమర్శించారు.  శ్రీకాంతాచారి ఆత్మబలిదానం ద్వారానే తెలంగాణ వచ్చిందని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్దాంతాల ద్వారానే తెలంగాణ సాకారమైందన్నారు. కీటీఆర్ బర్త్ డే కి పోకపోతే బెల్లంపల్లి లో ముగ్గురూ ఉద్యోగులకు మెమో ఇచ్చారని ప్రస్తావిస్తూ.. ఇలాంటి భూ స్వామ్య రాజరిక పాలన పోవాలని ప్రవీణ్ కుమార్ కోరారు. రాష్ట్రంలో బడుగు బలహీనులు ఒక్కటి కావాలి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 
‘‘సంక్షేమ భవనంలో 9ఏళ్లు పని చేశా.. చిన్న చిన్న పనుల కోసం అక్కడ సెక్యూరిటీ గార్డు కాల్లు మొక్కు తుండే..  ప్రగతి భవన్లో లోపలికి ఎవర్ని రానివ్వడు..పంజాగుట్ట రోడ్డును ఆక్రమించుకున్నారు.. మనం కలిసి కట్టుగా లేకనే వాళ్లు రాజ్యం ఏలుతున్నరు.. కేటిఆర్ ఎన్ని కుట్రలు చేసినా సిరిసిల్లలో సభ సక్సెస్ అయింది.. ఒకరి కింద ఒకరు కాదు..ఒకరి నొకరు కలిసి ఉందాం..’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.  మనం ఒక్కటిగా లేనంత వరకు అవమానాలు జరుగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు.