
- నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం: హరీశ్‌రావు
- ఇతర పార్టీల నాయకులలాగా ఆమె మాట్లాడారు
- తెలంగాణ సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు
- లండన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న మాజీ మంత్రి
- అక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు
- తొలుత కేటీఆర్, తర్వాత కేసీఆర్‌తో సమావేశం
- మధ్యాహ్నానికి జాయిన్ అయిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
- కవిత ఎపిసోడ్ పై కేసీఆర్ ఆరా.. తెగేవరకు లాగారంటూ ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు:తన రాజకీయ జీవితం తెలంగాణ ప్రజలకు తెరిచిన పుస్తకం అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఇతర పార్టీలు, కొందరు నాయకులు చేస్తున్న ఆరోపణలనే కవిత చేశారని , ఆ వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. శనివారం లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన ఎయిర్‌పోర్టులోనే మీడియాతో మాట్లాడారు. కవిత వ్యాఖ్యలపై స్పందించారు. “తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి తెలంగాణ సాధించాం. రాష్ట్రంలో రైతులు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క వరద ప్రాంతాల ప్రజలు కష్టాలు పడుతున్నారు. పదేండ్లలో కేసీఆర్ నిర్మించిన వ్యవస్థలన్నింటినీ రేవంత్ సర్కారు ధ్వంసం చేస్తున్నది. ఇలాంటి సమయంలో తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. దానిపైనే మా దృష్టి ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తాం.. ప్రజల కష్టాలు తీరుస్తాం” అని పేర్కొన్నారు.
నేరుగా ఫామ్‌హౌస్‌కే..
లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన హరీశ్‌రావు.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే వెళ్లారు. ఉదయం తొలుత ఆయన కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆ ఇద్దరు కలిసి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కవిత చేసిన సంచలన ఆరోపణలపై కేసీఆర్ ఆరా తీశారు. కవిత ఎపిసోడ్‌పై ఇద్దరికీ కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. అనవసరంగా తెగే వరకు లాగారంటూ మండిపడ్డారని సమాచారం. కవితపై ఎక్కువగా ఫోకస్ పెట్టొద్దని, ఆమె పార్టీ పెడితే అనుసరించాల్సిన చర్యలపై తర్వాత చూసుకోవచ్చని చెప్పినట్టు తెలిసింది. అనవసరంగా ఈ విషయంపై దృష్టి సారిస్తే.. వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటంలో వెనకడుగు పడుతుందని చెప్పినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది.
ఎమ్మెల్సీ పోచంపల్లిపై సీరియస్
హరీశ్‌రావుతోపాటు మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. కవిత తన ప్రెస్‌మీట్‌లో ఆయనపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్కై మోకిలాలో రూ.750 కోట్ల ప్రాజెక్టుకు సూటి పెట్టారని ఆరోపించారు. దీంతో ఆయనపైనా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఈ ఆరోపణలకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. కాగా, వాళ్లతోపాటు మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు కూడా సమావేశానికి హాజరయ్యారు.
కవితను ఎందుకు పిలవలేదు?
కవిత ఆరోపణలు చేసిన శ్రీనివాస్‌రెడ్డిని కేసీఆర్ పిలిపించి వివరణ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు వచ్చిన వెంటనే ఎమ్మెల్సీని పిలిచి వివరణ తీసుకున్న కేసీఆర్.. ఆది నుంచీ కవిత తనకు ఎదురవుతున్న పరిణామాలపై నోరు విప్పినా ఎందుకు పిలవలేదని ఆమె వర్గం ప్రశ్నిస్తున్నది. మరోవైపు హరీశ్, జగదీశ్‌రెడ్డి, సంతోష్ రావులే లక్ష్యంగా ‘కవితక్క అప్డేట్స్’ అనే ఎక్స్ ఖాతాలో కవిత అనుచరులు ఆరోపణలకు పదును పెంచారు. హంపీలో నల్గొండ కీలక నేత సహా పలువురు ఎమ్మెల్యేల పార్టీ వ్యవహారంపై పోస్టులు పెట్టారు.