ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది... ఆశ భయాన్ని ఓడిస్తుంది

ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది... ఆశ భయాన్ని ఓడిస్తుంది

విద్వేష, విభజన రాజకీయాలకు తన తండ్రి బలయ్యాడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇప్పటికే తండ్రిని కోల్పోయాను.. ఇప్పుడు దేశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర ప్రారంభం సందర్భంగా చెన్నైలోని పెరుంబుదూర్ లోని రాజీవ్ స్మారకాన్ని తన రాజకీయ ప్రవేశం తర్వాత మొదటిసారి సందర్శించారు. అనంతరం ఆయనకు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఓ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది... ఆశ భయాన్ని ఓడిస్తుందని పేర్కొన్నారు. ఐక్యంగా కలిసి పోరాటం చేస్తే ఏమైనా సాధించవచ్చని రాహుల్ ట్వీట్ చేశారు.

భారత్ జోడో యాత్ర నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3.05 గంటలకు తీరువల్లూర్ మెమోరియల్ ను రాహుల్ సందర్శిస్తారు. 3.25గంటలకు కామరాజ్ మెమోరియల్‌ను సందర్శించి, సాయంత్రం 4.10గంటలకు మహాత్మాగాంధీ మండపం వద్ద ప్రార్థనలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహాత్మాగాంధీ మండపంలో జాతీయ జెండా అందజేత కార్యక్రమంలో భాగంగా తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ రాహుల్ కు జాతీయ జెండాను అందిస్తారు. 4.40 గంటలకు భారత్ జోడో యాత్రికులతో కలిసి మహాత్మా గాంధీ మండపం నుంచి బీచ్ రోడ్ వరకు జరిగే మార్చ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5గంటలకు కన్యాకుమారికి చేరుకొని భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ అధికారికంగా ప్రారంభించనున్నారు.