ఓటర్లు మస్త్ స్మార్ట్.. కేజీ మటన్ పంచినా గెలవలేకపోయా : నితిన్ గడ్కరీ

ఓటర్లు మస్త్ స్మార్ట్.. కేజీ మటన్  పంచినా గెలవలేకపోయా  : నితిన్ గడ్కరీ

ఓటర్లపై కేంద్రమంత్రి  నితిన్ గడ్కరీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.   నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర స్టేట్ టీచర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్టుగా  హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు చాలా తెలివైనవాళ్లని..   తాను ఓ సారి ఓటర్లుకు కేజీ చొప్పున మటన్ పంచానని, అయినప్పటికీ తాను ఓడిపోయానని చెప్పారు. 

ఓటర్లు మస్త్ స్మార్ట్ అన్న ఆయన.. ప్రతి అభ్యర్థి దగ్గర తాయిలాలు తీసుకుంటారు.. కానీ ఎవరికి ఓటు వేయాలో వారికే వేస్తారు.  డబ్బులు, ఇతర వస్తువులు పంచి ఎన్నికల్లో గెలుస్తారంటే తాను నమ్మనన్నారు.   రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురిచేసే బదులు ప్రజల హృదయాల్లో విశ్వాసాన్ని, ప్రేమను పెంచండని నితిన్ తెలిపారు.  

ఓటమి చాలా నేర్పుతుందన్న గడ్కరీ...  అయితే ఏ ఓటమి కూడా చివరి పరాజయం కాదన్నారు.  ఓటమి జనాలు మనకు ఇచ్చే విలువైన సలహా  అని వెల్లడించారు. ఏ రాజకీయ నాయకుడైనా ఓటరు మనసులో నమ్మకాన్ని సృష్టిస్తాడో.. అప్పుడు ఓటరు కుల, మత, భాషలకు అతీతంగా అతన్ని  ప్రేమిస్తాడన్నారు.  పోస్టర్, బ్యానర్ లాంటివి అసలు అవసరమే లేదన్నారు.