- ఇజ్రాయెల్ ప్రధానిగా ఈజీగా గెలుస్తా
- 99 శాతం మంది నాకే ఓటేస్తరు: ట్రంప్
- నెతన్యాహు తాను చెప్పినట్లు వింటారని కామెంట్
వాషింగ్టన్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాను చెప్పినట్లు వింటారని, ఆ దేశంలో తనకు ఎంతో పాపులారిటీ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ తాను ఇజ్రాయెల్ వెళ్లి, అక్కడ ప్రధాన మంత్రి పదవికి పోటీ పడితే ఈజీగా గెలుస్తానని అన్నారు. ఇజ్రాయెల్ పౌరులు తనను ఎంతగానో ఇష్టపడతారని, 99 శాతం ఓట్లు తనకే పడతాయని ట్రంప్ చెప్పారు. ఇటీవల ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పూర్తిగా తన అదుపులోనే ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు.
‘నెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏది చెబితే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, అధ్యక్షుడిగా తన మొదటి టర్మ్ లో జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడం, అబ్రహం ఒప్పందాలు కుదర్చడం వంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నానని ట్రంప్ గుర్తుచేశారు.
దాని ఫలితంగానే ఇజ్రాయెల్ సమాజంలో తనకు ఇప్పుడు ఈ స్థాయి తిరుగులేని ప్రజాదరణ లభించిందని పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, నెతన్యాహుపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.
