
ముంబై: టీమిండియాలో మళ్లీ చోటు సంపాదించాలన్న కలను ఎప్పటికీ వదలనని వెటరన్ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానె స్పష్టం చేశాడు. గత రెండు సంవత్సరాలుగా నేషనల్ టీమ్‌కు దూరమైనా దేశానికి మళ్లీ ప్రాతినిధ్యం వహించాలన్న తపన తనలో ఇంకా ఉందని చెప్పాడు. ‘ఇండియా టీమ్‌లోకి తిరిగి రావాలని అనుకుంటున్నా. ఆ కోరిక, ఆకలి, ఉత్సాహం ఇంకా నాలో ఉన్నాయి.
ఫిట్‌నెస్ పరంగా నేను సరైన కండిషన్‌లోనే ఉన్నా. ప్రస్తుతం ఒక్కో మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుంటూ ఆడుతున్నా. ఇప్పుడు ఐపీఎల్ మీదే దృష్టి పెట్టాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం’ అని రహానె తెలిపాడు. 2020–21లో ఆస్ట్రేలియాలో బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో కెప్టెన్‌గా ఇండియాను గెలిపించిన అజింక్యా ఆ తర్వాత యంగ్‌స్టర్లతో పోటీతో రెండేండ్లుగా జట్టులో చోటు కోల్పోయాడు.
నెల రోజుల్లో 37 ఏండ్లకు చేరనున్న రహానె మళ్లీ నేషనల్ టీమ్‌లోకి రావడమే తన టార్గెట్ అంటున్నాడు. ‘నేను ఎప్పటికీ తలొగ్గే వ్యక్తిని కాదు. గ్రౌండ్‌లో నా బెస్ట్ ఇవ్వాలని, వంద శాతం కంటే ఎక్కువే ఇవ్వాలని ప్రయత్నిస్తుంటా. ప్రతి ఉదయం నిద్రలేవగానే నేను చేరుకోవాల్సిన లక్ష్యాలే కనిపిస్తాయి. దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి మించిన గౌరవం నాకు లేదు. ఇండియా జెర్సీ మళ్లీ వేసుకోవాలన్న కోరిక ఇప్పటికీ నాలో ఉంది. అందుకే ఆఫ్ సీజన్‌లో సైతం ప్రతి రోజూ 2–3 సెషన్లు ప్రాక్టీస్ చేస్తుంటా. ఫిట్‌నెస్, రికవరీ, డైట్ ఇలా అన్నింటిపై ఫోకస్ పెడుతున్నా. టీమిండియాకు మళ్లీ ఆడాలన్న మోటివేషన్, ఆటపై ప్రేమ ఇంకా అలాగే ఉంది’ అని పేర్కొన్నాడు.