బెంగళూరు: ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వయసు పైబడటం, ఆరోగ్య సమస్యలు, కలుషిత రాజకీయాలే కారణమని ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. మండ్య జిల్లా కేఆర్.పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం చురుకుగా కొనసాగుతానని, ప్రజల కష్టాలు, సంక్షేమం కోసం ఎప్పటిలాగే గళం వినిపిస్తానని వివరించారు.
తన నియోజకవర్గ ప్రజలు మరోసారి పోటీ చేయాలని కోరుతున్నారు కానీ పోటీకి దూరంగా ఉండాలని తాను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో ప్రజలే ఆర్థికంగా అండగా నిలిచేవారని, ప్రస్తుత రాజకీయాల్లో ఉండాలంటే డబ్బులు పంచాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
