ఐఏఎఫ్​లోకి ఎలక్ట్రిక్ వెహికల్స్

ఐఏఎఫ్​లోకి ఎలక్ట్రిక్ వెహికల్స్

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. తన వాహనాల గ్రూపులోకి పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా 12 ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనుగోలు చేసింది. మంగళవారం ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ హెడ్‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్ లో జరిగిన ఫ్లాగ్ ఆఫ్ వేడుకల సందర్భంగా ఐఏఎఫ్ ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది. సిబ్బంది సమక్షంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వీ.ఆర్ ఛౌదరి, పలువురు సీనియర్ అధికారులు ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఫస్ట్ బ్యాచ్‌‌‌‌‌‌‌‌ను జెండా ఊపి ప్రారంభించారు.

రవాణా రంగంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం ఇటీవల గ్రీన్ మొబిలిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి అనుగుణంగా  టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను ఐఏఎఫ్ తన వాహనాల గ్రూపులో చేర్చుకున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పర్యావరణం కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఐఏఎఫ్ యోచిస్తున్నట్లు వెల్లడించారు. వైమానిక దళాలు ఉండే ప్రదేశాల్లో ఈ వాహనాల చార్జింగ్ సెంటర్లను నెలకొల్పనున్నట్లు వివరించారు. ఢిల్లీలో మొదటి బ్యాచ్ ఎలక్ట్రిక్ కార్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు.