
- ఇన్‌కమ్ ట్యాక్స్ కింద రూ.8 కోట్లు కూడా చెల్లించినం
- నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఫార్ములా-ఈ రేసు ఒప్పందాలు
- ఏసీబీ విచారణలో ఐఏఎస్ అర్వింద్ కుమార్ వెల్లడి
- 6 గంటల పాటు స్టేట్‌మెంట్ రికార్డు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే ఫార్ములా–ఈ రేసు ఈవెంట్లు జరిగాయని సీనియర్ ఐఏఎస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ వెల్లడించారు. కేటీఆర్ ఆదేశాలతోనే ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)కు రూ.45.71 కోట్లు బదిలీ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఏసీబీకి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఫార్ములా-–ఈ రేసు కేసులో రెండో నిందితుడైన అర్వింద్ కుమార్ గురువారం ఉదయం ఉదయం 11:30 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డీఎస్పీ మాజీద్ అలీ నేతృత్వంలో ఏసీబీ అధికారులు ఆయనను విచారించారు. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కేటీఆర్, ఎఫ్‌ఈవో, ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థల ప్రతినిధులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా విచారించారు.
నిర్ణయాలన్నీ నాటి పెద్దలవే..
ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి తాను సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఏసీబీకి అర్వింద్ కుమార్ చెప్పినట్టు తెలిసింది. ‘‘ఈ ఈవెంట్ వల్ల నాకు ఎలాంటి సొంత ప్రయోజనాలు లేవు. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నేను నడుచుకున్నాను. ఈ రేసుకు సంబంధించి అన్ని అగ్రిమెంట్లు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే జరిగాయి. ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు చేశాం” అని వెల్లడించినట్టు సమాచారం. ప్రధానంగా నిధుల బదిలీ, నిబంధనల ఉల్లంఘనపైనే ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. 2022 అక్టోబర్ 25న ఎంఏయూడీ, ఎఫ్‌ఈవో, ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థల మధ్య జరిగిన మొదటి త్రైపాక్షిక ఒప్పందం గురించి వివరాలు సేకరించినట్టు సమాచారం. ఎఫ్‌ఈవో, ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థల మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించిన వివరాలు కూడా అడిగినట్టు తెలిసింది. 2023 ఫిబ్రవరి 11న జరిగిన సీజన్ 9 ట్రాక్ నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి రూ.12 కోట్లు చెల్లించడంపైనా ఏసీబీ ఆరా తీసింది.
అందుకే ఎఫ్‌ఈవోతో ఒప్పందం..
అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే 2023 అక్టోబర్ 10న ఎంఏయూడీ, ఎఫ్‌ఈవో మధ్య జరిగిన ఒప్పందం గురించి ఏసీబీకి అర్వింద్ కుమార్ వివరించారు. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా తన పరిమితులకు లోబడే విధులు నిర్వర్తించానని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ‘‘ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ సీజన్ 10 నుంచి తప్పుకోవడంతోనే ఎఫ్‌ఈవోతో ఎంఏయూడీ ఒప్పందం చేసుకుంది. ఇదంతా నాటి మున్సిపల్ శాఖ మంత్రి ఆమోదంతోనే జరిగింది. ఆ తర్వాత హెచ్‌ఎండీఏ బోర్డు అకౌంట్ నుంచి ఎఫ్‌ఈవోకు రూ.45.71 చెల్లించాం. దీంతో పాటు రూ.8 కోట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ కూడా బోర్డు నిధుల నుంచే చెల్లించాం” అని స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో పాటు హెచ్‌ఎండీఏ బోర్డు నిధులను ఖర్చు చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. కాగా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.