అండర్ 19 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల.. టైటిల్ రేసులో 16 జట్లు

అండర్ 19 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల.. టైటిల్ రేసులో 16 జట్లు

వచ్చే ఏడాది జరగనున్న అండ‌ర్ -19 పురుషుల‌ వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. ఈ టోర్నీ జ‌న‌వ‌రి 19న మొదలై.. ఫిబ్ర‌వ‌రి 11న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించారు. మొత్తం 16 జ‌ట్లు టైటిల్ కోసం పోటీ ప‌డ‌నుండగా.. వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభ‌జించారు.

ఈ టోర్నీ దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంక వేదికగా జరగాల్సి ఉండగా, రాజకీయ జోక్యం కారణంగా ఐసీసీ.. శ్రీలంకను సస్పెండ్  చేయడంతో దక్షిణాఫ్రికాకు తరలించారు. మొత్తం 41 మ్యాచ్‌లు జరగనుండగా, వీటిని ఐదు వేదికల్లో నిర్వహించనున్నారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్‌తో తలపడనుండగా, భార‌త జ‌ట్టు జ‌న‌వ‌రి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడ‌నుంది.

సెమీస్ చేరే జట్లు ఎలా అంటే.. 

మొదట ప్రతి జట్టు అదే గ్రూప్‌లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. తద్వారా ఆయా గ్రూపుల్లో నాలుగు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు.. మిగిలిన గ్రూపుల్లోని జట్లతో తలపడాల్సి ఉంటుంది. అనంతరం ఆయా గ్రూపుల్లో టాప్‌లో నిలిచిన జట్ల మధ్య  సెమీస్ ఫైట్ ఉంటుంది. 

  • గ్రూప్ ఏ: భార‌త్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా.
  • గ్రూప్ బి: ఇంగ్లాండ్, ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్.
  • గ్రూప్ సి: ఆస్ట్రేలియా, శ్రీ‌లంక‌, జింబాబ్వే, న‌మీబియా.
  • గ్రూప్ డి: అఫ్గ‌నిస్థాన్, పాకిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్.

ఐదు స్టేడియాల్లో మ్యాచ్‌లు

  • విల్లోమూర్ పార్క్(బెనోని), 
  • మాంగాంగ్ ఓవల్(బ్లూమ్‌ఫోంటైన్‌), 
  • కింబర్లీ ఓవల్( కింబర్లీ), 
  • జెబి మార్క్స్ ఓవల్(పోచెఫ్‌స్ట్‌రూమ్‌), 
  • బఫెలో పార్క్(ఈస్ట్ లండన్‌)

వార్మప్ మ్యాచ్‌లు

జనవరి 13-17 మధ్య అన్ని జట్లు దక్షిణాఫ్రికాలో రెండేసి చొప్పున వార్మప్ మ్యాచ్‌లు ఆడతాయి.