శ్రీలంక క్రికెట్‌‌ బోర్డుపై వేటు.. సస్పెండ్‌‌ చేసిన ఐసీసీ

శ్రీలంక క్రికెట్‌‌ బోర్డుపై వేటు..  సస్పెండ్‌‌ చేసిన ఐసీసీ

లండన్‌‌: వరల్డ్‌‌ కప్‌‌లో ఘోరంగా ఫెయిలైన శ్రీలంకకు ఐసీసీ మరో షాకిచ్చింది. లంక క్రికెట్‌‌(ఎస్‌‌ఎల్‌‌సీ)లో గవర్నమెంట్‌‌ జోక్యం ఎక్కువైందన్న కారణంతో బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్‌‌ చేసింది. శుక్రవారం సమావేశమైన ఐసీసీ బోర్డు ఈ మేరకు చర్యలు తీసుకుంది. ‘ఓ సభ్య దేశంగా శ్రీలంక బోర్డు స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతున్నది. 

ప్రతి విషయంలో ఆ దేశ ప్రభుత్వ జోక్యం ఎక్కువైంది. బోర్డు స్వతంత్రంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లోనూ గవర్నమెంట్‌‌ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తున్నది. అందుకే సస్పెన్షన్‌‌ విధిస్తున్నాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. సస్పెన్షన్‌‌కు సంబంధించిన షరతులను ఐసీసీ బోర్డు సరైన టైమ్‌‌లో నిర్ణయిస్తుందని తెలిపింది. ఈ నెల 21 జరిగే ఐసీసీ మీటింగ్‌‌ తర్వాత సస్పెన్షన్‌‌కు సంబంధించిన మిగతా అంశాలపై స్పష్టత వచ్చే చాన్స్‌‌ ఉంది. 

అయితే లంక బోర్డుపై వేటు పడటంతో.. వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్‌‌–19 వరల్డ్‌‌ కప్‌‌ నిర్వహణపై సందిగ్ధత మొదలైంది. తర్వాత జరిగే టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో లంక ఆడటం కూడా డౌటే. సస్పెన్షన్‌‌ను రద్దు చేసే వరకు ఐసీసీ ఈవెంట్లను నిర్వహించే అవకాశం ఉండదు. అలాగే ఇంటర్నేషనల్ బాడీ నుంచి ఎలాంటి నిధులు కూడా అందవు.