T20 World Cup 2026: 14వ స్థానంలో ఉన్న స్కాట్లాండ్ వరల్డ్ కప్‌కు క్వాలిఫై.. కారణమిదే!

T20 World Cup 2026: 14వ స్థానంలో ఉన్న స్కాట్లాండ్ వరల్డ్ కప్‌కు క్వాలిఫై.. కారణమిదే!

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న 2026 టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకుంది. దీంతో టీ20 వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లా ఆడుతుందా.. లేదా..? అని గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. టోర్నీ నుంచి బంగ్లా వైదొలగడంతో ఆ జట్టు స్థానంలో మరో టీమ్‎ను ఐసీసీ భర్తీ చేయనుంది.  బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ రావడం దాదాపు ఖరారైంది. అయితే స్కాట్లాండ్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో 14 వ స్థానంలో ఉంది. అలాంటి జట్టు వరల్డ్ కప్ కప్ కు అర్హత సాధిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. 

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో స్కాట్లాండ్ ప్రస్తుతం 14వ స్థానంలో ఉంది. రిచీ బెర్రింగ్టన్ కెప్టెన్సీలోని స్కాట్లాండ్ యూరోపియన్ క్వాలిఫయర్స్ ద్వారా టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు, నెదర్లాండ్స్, ఇటలీ, జెర్సీల తర్వాత నాల్గవ స్థానంలో నిలిచారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో స్కాట్లాండ్ కంటే ముందున్న 13 జట్లు వరల్డ్ కప్ కు క్వాలిఫై అయ్యాయి. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌,న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, ఐర్లాండ్‌,జింబాబ్వే, నెదర్లాండ్స్ టాప్ -13 లో ఉన్నాయి. దీంతో ఆ తర్వాత స్థానంలో స్కాట్లాండ్.. బంగ్లాదేశ్ కు రీప్లేస్ గా రానుంది. 

ఇండియాలో నాలుగు లీగ్ మ్యాచ్ లు:

భారత్‌, శ్రీలంక ఆతిథ్య దేశాలుగా 2026, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్‎తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ షెడ్యూల్ ను స్కాట్లాండ్ రీప్లేస్ చేయనుంది. 

Also Read  : అక్షర్ పటేల్ గాయంతో టీమిండియాకు కొత్త సమస్య

అసలేం జరిగిందంటే..?

ఇటీవల బంగ్లాదేశ్, ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. దీంతో వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తాము ఆడబోయే మ్యాచ్ లను ఇండియా బయట తటస్థ వేదికలకు తరలించాలని బ్లంగా క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. లేదంటే తమ జట్టును గ్రూప్–సి నుంచి గ్రూప్–బికి మార్చాలని మరో ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే.. ఇప్పటికే టోర్నీ షెడ్యూల్ ఫిక్స్ కావడంతో బీసీబీ అభ్యర్థనలను ఐసీసీ తిరస్కరించింది. ఇండియాలో ఆడాల్సిందేనని.. లేదంటే టోర్నీ నుంచి తప్పుకోవాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఇండియాలో ఆడేందుకు ఇష్టపడని బంగ్లాదేశ్ వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం (జనవరి 22) ప్రకటించింది.

టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించిన 20 జట్ల లిస్ట్ ఇదే:

భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, స్కాట్లాండ్, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నమీబియా, ఒమన్, నేపాల్, యూఏఈ