శ్రీలంక నుంచి సౌత్ ఆఫ్రికాకు అండర్-19 ప్రపంచ కప్

శ్రీలంక నుంచి సౌత్ ఆఫ్రికాకు  అండర్-19 ప్రపంచ కప్

శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం (నవంబర్ 10) ప్రకటన చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఐసీసీ వెల్లడించింది. దీంతో ఈ సస్పెన్షన్ ఎత్తి వేసే వరకూ లంకేయులు ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనలేరు. ఈ నేపథ్యంలో శ్రీలంకలో నిర్వహించాల్సిన U-19, 2024 ప్రపంచ కప్‌ దక్షిణాఫ్రికా వేదికగా జరపనున్నట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుంది.   

స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న లంక క్రికెట్ బోర్డు విషయంలో ప్రభుత్వం జోక్యం కారణంగానే బోర్డును సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అండర్-19 ప్రపంచ కప్ 2024 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 15 మధ్య జరగాల్సి ఉంది. అదే సమయంలో SA20 లీగ్ ఇక్కడ జరగనుంది. నవంబర్ 21న అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందని క్రిక్‌బజ్ నివేదించింది.

భారత్ వేదికగా జరిగిన 2023 వరల్డ్ కప్ లో శ్రీలంక ఘోరంగా విఫలమైంది. మొత్తం 9 లీగ్ మ్యాచ్ ల్లో 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ పై, నెదర్లాండ్స్ పై గెలిచిన లంక జట్టు మిగిలిన మ్యాచ్ ల్లో ఓడింది. ఈ క్రమంలో 2025 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడంలో విఫలమైంది.