
లీడ్స్: ఇంగ్లండ్‌తో ముగిసిన తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో అంపైర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినందుకు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఐసీసీ మందలించింది. అలాగే ఓ డీ మెరిట్ పాయింట్‌ను కూడా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో లెవెల్–1 రూల్‌ను పంత్ ఉల్లంఘించినట్లు తేల్చింది. గత రెండేళ్లలో పంత్ చేసిన తొలి తప్పిదం కావడంతో కేవలం మందలింపుతో సరిపెట్టింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 61వ ఓవర్‌లో హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. బంతిని మార్చాలని పంత్ అంపైర్లను కోరగా, వాళ్లు బాల్ గేజ్‌తో చెక్ చేశారు. బాల్ బాగానే ఉండటంతో మార్చేందుకు అంగీకరించకపోవడంతో అంపైర్ల ముందే బంతిని నేలపై విసిరి తన అసమ్మతిని తెలియజేశాడు. దీనిపై అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. అయితే పంత్ తప్పును అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండా మందలింపుతో సరిపెట్టారు.