T20 World Cup 2024: జూన్ 1 నుంచే పొట్టి సమరం.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ

T20 World Cup 2024: జూన్ 1 నుంచే పొట్టి సమరం.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ

ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఐసీసీ గుడ్ న్యూస్ చెబుతూ షెడ్యూల్ ప్రకటించేసింది. జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29 న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

గ్రూప్ 'ఏ' లో పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా, భారత్ లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్, చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా  గ్రూప్‌ 'బి' లో  ఉన్నాయి. ఆతిథ్య వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గినియా గ్రూప్ 'సి' లో తలపడతాయి. గ్రూప్ 'డి' లో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాడ్స్, నేపాల్ జట్లతో గ్రూప్ ఆఫ్ డెత్ గా పరిగణిస్తున్నారు.   

భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే జూన్ 5 న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు  జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. జూన్ 12 న న్యూయార్క్ లో అమెరికాపై, 15 న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. భారత్ తమ గ్రూప్ మ్యాచ్ లన్ని అమెరికాలోనే ఆడబోతుంది.

20 జట్ల మధ్య పోరు

ఎన్నడూలేని రీతిలో ఈసారి 20 జట్ల మధ్య పోటీ జరగనుండగా.. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు వేదికలు అమెరికాలో ఉండగా.. మరో ఐదు వేదికలు కరేబియన్‌ దీవుల్లో ఉండనున్నాయి. అమెరికాలోని 5  వేదికలను ఐసీసీ ఇప్పటికే ఖారారు చేసినట్లు సమాచారం. అందులో ఫ్లోరిడాతో పాటు మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్క్, లాడారు హిల్ ఉన్నాయి. 

మొత్తం 55 మ్యాచ్ లతో ఈ సారి గ్రాండ్ గా ఈ టోర్నీ జరగనుంది. అమెరికాలో 16 మ్యాచ్ లు జరగనుండగా.. సూపర్-8 మ్యాచ్ లతో సహా ప్రధాన మ్యాచ్ లు వెస్టిండీస్ వేదికగా జరుగుతాయి. 2013 నుంచి ఐసీసీ టోర్నీలో ఒకే గ్రూప్ లో ఉంటూ వస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు ఈ సారి కూడా ఒకే గ్రూప్ లో ఉండబోతున్నాయి.        

ఐదేసి జట్లు చొప్పున 4 గ్రూపులు

జట్లు ఎక్కువ అవ్వడంతో ఈసారి టోర్నీని భిన్నంగా నిర్వహించనున్నారు. గతంలో తొలి రౌండ్‌ ముగిశాక సూపర్‌-12 మ్యాచ్‌లు ఆడేవారు. కానీ ఈసారి 20 జట్లను ఐదేసి జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం ప్రతి గ్రూప్ నుంచి టాప్‌-2 టీమ్స్‌ సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ఆపై 8 జట్లను నాలుగేసి చొప్పున రెండు గ్రూపులుగా ఆడిస్తారు. గ్రూప్ దశలో ఆడిన ప్రదర్శన కారణంగా సూపర్-8 షెడ్యూల్ ఉంటుంది. ఇక్కడ ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి.