T20 World Cup 2024: న్యూయార్క్‌లో కొత్త స్టేడియంను ఆవిష్కరించిన ఐసీసీ

T20 World Cup 2024: న్యూయార్క్‌లో కొత్త స్టేడియంను ఆవిష్కరించిన ఐసీసీ

వెస్టిండీస్, అమెరికా 2024 టీ20 ప్రపంచ కప్ కు ఆతిధ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29 న ముగుస్తుంది. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వెస్టిండీస్ లో స్టేడియాలు సిద్ధంగా ఉన్నా.. అమెరికాలో వేదికల విషయంపై ఇంకా సందిగ్థత నెలకొంది. అయితే తాజాగా న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను ఐసీసీ బుధవారం(జనవరి 17) ఆవిష్కరించింది. న్యూయార్క్‌లోని  ఈ స్టేడియం మొత్తం ఎనిమిది మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.  
 
క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదరు చూస్తున్న ఇండియా , పాకిస్థాన్ మ్యాచ్ ఇదే స్టేడియంలో జరగనుంది. జూన్ 9 న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ స్టేడియంలో మొత్తం 34,000 సీట్ల కెపాసిటీ సామర్ధ్యం ఉంది. ఇక్కడ వికెట్ అడిలైడ్ ఓవల్, ఈడెన్ పార్క్‌లో ఉపయోగించిన మాదిరిగానే డ్రాప్-ఇన్ స్క్వేర్, ఫ్లోరిడాలో క్యూరేట్ చేయబడుతోంది. టీ20 వరల్డ్ కప్ 2024 కి ముందు న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను ఆవిష్కరించడం పట్ల మేము సంతోషిస్తున్నామని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ అన్నారు.  

గ్రూప్ 'ఏ' లో పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా, భారత్ లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్, చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా  గ్రూప్‌ 'బి' లో  ఉన్నాయి. ఆతిథ్య వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గినియా గ్రూప్ 'సి' లో తలపడతాయి. గ్రూప్ 'డి' లో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాడ్స్, నేపాల్ జట్లతో గ్రూప్ ఆఫ్ డెత్ గా పరిగణిస్తున్నారు.   

భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే జూన్ 5 న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు  జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. జూన్ 12 న న్యూయార్క్ లో అమెరికాపై, 15 న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. భారత్ తమ గ్రూప్ మ్యాచ్ లన్ని అమెరికాలోనే ఆడబోతుంది.