నేడే కివీస్‌‌తో ఇండియా సెమీస్‌‌ ఫైట్‌‌

నేడే కివీస్‌‌తో ఇండియా సెమీస్‌‌ ఫైట్‌‌

ఇప్పుడు ఆడితే చరిత్ర.. ఇక్కడ గెలిపిస్తే ఘనత.. !

ఇప్పుడు కొడితే హిట్‌‌.. ఇక్కడ పడితే ఫట్‌‌..!

కలల కప్‌‌ను ముద్దాడేందుకు ఇక మిగిలింది.. రెండు అడుగులే.. !

విశ్వ సమరంలో వీరుల్లా నిలిచేందుకూ మిగిలింది.. రెండు అడుగులే..!

కొత్త చరిత్రలో పేరు లిఖించుకునేందుకు వేయాల్సింది.. రెండు అడుగులే..!

వరల్డ్‌‌కప్‌‌ సెమీస్‌‌తో ‘ఏడడుగుల’ అనుబంధాన్ని ‘మూడు కప్‌‌’ల బంధంగా మార్చుకోవాలంటే..

నేడు న్యూజిలాండ్‌‌తో జరిగే నాకౌట్‌‌ పోరాటంలో  టీమిండియా గెలిచి ఫైనల్లో అడుగు పెట్టాలని యావత్‌‌ దేశం ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తోంది..!

7= వరల్డ్‌ కప్‌‌ల్లో ఇండియా సెమీస్‌ కు చేరడం ఇది ఏడోసారి. గత ఆరు పర్యాయాల్లో మూడుసార్లు మాత్రమే గెలిచింది. న్యూజిలాండ్‌ ఇప్పటికే ఏడుసార్లు సెమీస్‌ ఆడినా.. ఒకసారి (2015) మాత్రమే ఫైనల్ చేరింది.

అప్పుడప్పుడు అడుగులు తడబడినా.. అంచనాలు తప్పకుండా వరల్డ్‌‌కప్‌‌ ఆఖరి అంకానికి చేరుకున్న ఇండియా చివరి ఘట్టాన్నీ చిరస్మరణీయం చేసుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మంగళవారం జరిగే తొలి సెమీస్‌‌లో గత ఎడిషన్‌‌ రన్నరప్‌‌ న్యూజిలాండ్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టేబుల్‌‌ టాపర్‌‌గా నాకౌట్‌‌లోకి అడుగుపెట్టిన విరాట్‌‌సేన.. ఇక్కడా అదే జోరును చూపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఇక తొలి కప్‌‌ కోసం వేటాడుతున్న కివీస్‌‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేయాలని భావిస్తున్నది. దీంతో హిట్‌‌మ్యాన్‌‌ సారథ్యంలోని టీమిండియా టాపార్డర్‌‌కు, బ్లాక్‌‌ క్యాప్స్‌‌ సీమ్‌‌ బౌలింగ్‌‌ అటాక్‌‌కు మధ్య రసవత్తర పోరాటం ఖాయంగా కనిపిస్తున్నది. లీగ్‌‌ దశలో ప్లాన్‌‌–బి వర్కౌట్‌‌ కాకపోయినా తిరుగులేని విజయాలు సాధించిన విరాట్‌‌ బృందం.. నాకౌట్‌‌ కోసం కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో నాకౌట్‌‌ దశలో ఒత్తిడిని అధిగమించలేక చతికిలపడే అలవాటు ఉన్న కివీస్‌‌.. పాత చరిత్రకు ఫుల్‌‌స్టాప్‌‌ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్‌‌కప్‌‌ల్లో టీమిండియా సెమీస్‌‌కు చేరడం ఇది ఏడోసారి కాగా, గత ఆరుపర్యాయాల్లో మూడుసార్లు మాత్రమే గెలిచింది.

విలియమ్సన్‌‌పైనే భారం
కివీస్‌‌కు విజయం లేక దాదాపు 17 రోజులు అవుతుంది. లీగ్‌‌ దశ ఆరంభంలో చెలరేగిన విలియమ్సన్‌‌ బృందం.. చివర్లో ఘోరంగా చతికిలపడింది. చివరి మూడు మ్యాచ్‌‌ల్లో ఓడి ఇతర సమీకరణాలతో నాకౌట్‌‌ బెర్త్‌‌ను ఖాయం చేసుకుంది. దీంతో ప్రస్తుతం కివీస్‌‌ జట్టులో ఆత్మవిశ్వాసం లోపించింది. దీనిని ఆసరాగా చేసుకుంటే టీమిండియాకు తిరుగుండదు. బ్యాటింగ్‌‌ భారం మొత్తం కెప్టెన్‌‌ విలియమ్సన్‌‌ (481)పైనే పడటం ప్రతికూలాంశం. ఇతను ఔటైతే ఇన్నింగ్స్‌‌ పేకమేడలా కూలిపోతుంది. దీనిపై మేనేజ్‌‌మెంట్‌‌ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. అనుభవజ్ఞుడు టేలర్‌‌ మిడిల్‌‌ భారాన్ని మోస్తున్నా.. సహకారం కరువైంది. ఓపెనర్లలో గప్టిల్‌‌, నికోలస్‌‌ శుభారంభం ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా గప్టిల్‌‌ మెరుపులు చూడక చాలా కాలమైంది. లాథమ్‌‌, నీషమ్‌‌, గ్రాండ్‌‌హోమ్‌‌ బ్యాట్లు ఝళిపించాల్సిన సమయం ఆసన్నమైంది. సౌథీ ప్లేస్‌‌లో ఫెర్గుసన్‌‌ జట్టులోకి రావడంతో బౌలింగ్‌‌ బలం రెట్టింపైంది. బౌల్ట్‌‌, హెన్రీ అంచనాలు అందుకుంటే టీమిండియాను కట్టడి చేయొచ్చు. శాంట్నర్‌‌ స్పిన్‌‌ మ్యాజిక్‌‌ పని చేస్తుందో లేదో చూడాలి. ఓవరాల్‌‌గా టీమిండియా బ్యాటింగ్‌‌కు అడ్డుకట్ట వేయాలంటే కివీస్‌‌ బౌలర్లు శక్తికి మించి శ్రమించాలి.

రోహిత్‌‌, బుమ్రా కీలకం
ప్రస్తుతం టీమిండియా ఫామ్‌‌ను చూస్తే ఈ మ్యాచ్‌‌లో విజయం నల్లేరుమీద నడకే. కానీ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని కివీస్‌‌ను తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ప్లాన్‌‌–బిపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండా ప్లాన్‌‌–ఏ పూర్తిస్థాయిలో సక్సెస్‌‌ అయ్యేలా చూసుకోవాలి. ఫెర్గుసన్‌‌ (17 వికెట్లు) బౌన్సర్‌‌ను..  రోహిత్‌‌ (647) సిక్సర్‌‌ కొట్టగలిగితే, బౌల్ట్‌‌ (15 వికెట్లు) స్వింగ్‌‌ను..  రాహుల్‌‌ (360) సమర్థంగా ఎదుర్కోగలిగితే, హెన్రీ (10 వికెట్లు) షార్ట్‌‌ లెంగ్త్‌‌ బాల్స్‌‌ను… కోహ్లీ(442) బౌండరీ లైన్‌‌ దాటించగలిగితే ప్లాన్‌‌–ఏ సూపర్‌‌ సక్సెస్‌‌ అయినట్లే.  నాలుగో స్థానంలో పవర్‌‌ హిట్టర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌పై భారీ అంచనాలున్నా.. మిడిలార్డర్‌‌లో ధోనీ ఎలా ఆడతాడన్న ఉత్కంఠ మళ్లీ మొదలైంది. ఒకవేళ ఈ ఇద్దరు కుదురుకుంటే మాత్రం కివీస్‌‌ బౌలర్లు చేష్టలుడిగిపోవాల్సిందే. స్లో బౌలింగ్‌‌ను ఎదుర్కోవడంలో మహీ విఫలమవుతున్న నేపథ్యంలో.. లెఫ్టార్మ్‌‌ ఆర్థోడాక్స్‌‌ మిచెల్‌‌ శాంట్నర్‌‌ను ప్రయోగించాలని కివీస్‌‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అయితే సూపర్‌‌కింగ్స్‌‌ తరఫున శాంట్నర్‌‌తో కలిసి ఆడటం ధోనీకి కలిసొచ్చే అంశం. మిడిల్‌‌ బలోపేతం కోసం కేదార్‌‌ను తీసుకోవచ్చు. ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ ఇప్పటివరకు ఓ మోస్తరు ఫెర్ఫామెన్స్‌‌తోనే  నెట్టుకొస్తున్నాడు. బ్యాట్‌‌తో మెరుపు ఇన్నింగ్స్‌‌ బాకీ ఉన్నాడు. పాండ్యా కీలక సమయంలో వికెట్లు తీసి జట్టుకు మరో రకంగా ఉపయోగపడుతుండటం లాభించే అంశం. ఐదుగురు బౌలర్ల వ్యూహానికి కోహ్లీ కట్టుబడితే.. బుమ్రాకు తోడుగా భువనేశ్వర్‌‌, షమీలో ఎవర్ని తీసుకుంటారో చూడాలి. పాండ్యా పది ఓవర్ల కోటా పూర్తి చేస్తున్నాడు కాబట్టి.. రిస్క్‌‌ లేకుండా షమీకి చాన్స్‌‌ ఇవ్వొచ్చు. మణికట్టు స్పిన్నర్లు చహల్‌‌, కుల్దీప్‌‌లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి జడేజాను తీసుకునే చాన్స్‌‌ ఉంది.

ధోనీ అంటే మాకు ఎనలేని గౌరవం. నా కళ్లతో చూస్తే ఇది ఆకాశాన్ని తాకుతుంది. ఓ సారథిగా జట్టులో పరివర్తన తేవడం ఎంత క్లిష్టమో నాకు తెలుసు. పదేళ్లు కెప్టెన్‌‌గా పనిచేసిన ఆటగాడు సాధారణ సభ్యుడిగా టీమ్‌‌లో ఉండటం అంత సులభం కాదు. ఓ మెంటార్‌‌గా ఆధిపత్య ధోరణి లేకుండా మహీ జట్టులో కొనసాగుతున్నాడు. అది అతని గొప్పతనానికి నిదర్శనం. నేను సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తాడు. మహీలో ఉన్న అత్యుత్తమ లక్షణం అదే.

అదే సమయంలో సలహాలు, సూచనలు అడగడానికి కూడా నేను వెనకడుగు వేయను. ధోనీ ఎప్పుడూ తప్పించుకోవాలని చూడలేదు. చాలా ఏళ్లుగా అతనితో కలిసి క్రికెట్‌‌ ఆడుతున్నందుకు చాలా గర్వపడుతున్నా. యువకులైన మమ్ముల్ని నమ్మి చాలా అవకాశాలు ఇచ్చాడు. ఎవరికీ సాధ్యంకాని విజయాలను అందించాడు. దానివల్లే మేం ఇప్పుడు ఇండియా క్రికెట్‌‌ను ముందుకు తీసుకెళ్తున్నాం. అతనే ఈ టీమ్‌‌ను తీర్చిదిద్దాడు. ఇండియా క్రికెట్‌‌ను నడిపించిన తీరుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొచ్చింది.  ఎలాంటి నిర్ణయమైనా అతనే తీసుకుంటాడు.  ప్రసుతం మహీ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నాడు. మా అందరితోనూ సరదాగా గడుపుతున్నాడు.  –     

–  విరాట్​ కోహ్లీ

26 = సింగిల్‌‌ వరల్డ్‌‌కప్‌‌లో అత్యధిక స్కోరు చేసిన సచిన్‌‌ (673) రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్‌‌ (647)కు కావాల్సిన రన్స్‌‌.

350 = ధోనీకి ఇది 350వ వన్డే మ్యాచ్‌‌.

1 = మరో ఫిఫ్టీ చేస్తే వన్డేల్లో టేలర్‌‌ 50 హాఫ్‌‌ సెంచరీలు పూర్తి చేస్తాడు.

రద్దయితే ఇండియా ఫైనల్‌‌‌‌కు
సెమీస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు రిజర్వ్‌‌‌‌ డే ఉంది. ఒకవేళ మ్యాచ్‌‌‌‌ మొదలైన తర్వాత వర్షం వల్ల ఆగిపోతే..  బుధవారం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి కొనసాగిస్తారు. అయితే ఆ రోజు కూడా 60 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని బ్రిటన్‌‌‌‌ వాతావరణ శాఖ రిపోర్ట్‌‌‌‌. రెండు రోజులు మ్యాచ్‌‌‌‌ జరగకపోయినా.. ఫలితం రాకపోయినా.. లీగ్‌‌‌‌ దశలో టేబుల్‌‌‌‌ టాపర్‌‌‌‌గా ఉన్న టీమిండియా ఫైనల్‌‌‌‌కు చేరుకుంటుంది. ఎందుకంటే లీగ్‌‌‌‌ దశలో విరాట్‌‌‌‌సేన ఆడిన 8 మ్యాచ్‌‌‌‌ల్లో ఏడు గెలిచి 15 పాయింట్లు సాధించింది. కివీస్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ వర్షం వల్ల రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌‌‌‌ కేటాయించారు.

96.20 = ఈ టోర్నీలో కేన్‌‌ విలియమ్సన్‌‌ బ్యాటింగ్‌‌ సగటు.  అందరికంటే ఎక్కవ.  92.42  సగటుతో  రోహిత్‌‌  సెకండ్‌‌ ప్లేస్‌‌లో ఉన్నాడు.

ఇదీ చరిత్ర
ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 106 వన్డేలు జరగగా, టీమిండియా 55, కివీస్‌‌ 45 మ్యాచ్‌‌ల్లో నెగ్గాయి. ఒక మ్యాచ్‌‌ టైకాగా, ఐదు మ్యాచ్‌‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌‌లో ఎనిమిది సార్లు తలపడితే ఇండియా మూడుసార్లు, న్యూజిలాండ్‌‌ నాలుగుసార్లు నెగ్గాయి. ఒక మ్యాచ్​లో ఫలితం రాలేదు. చివరిసారి 2003 వరల్డ్‌‌కప్‌‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి.

జట్లు (అంచనా)
ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), రోహిత్‌‌, రాహుల్‌‌, రిషబ్‌‌, ధోనీ, కార్తీక్‌‌ / జాదవ్‌‌, పాండ్యా, భువనేశ్వర్‌‌, జడేజా / చహల్‌‌, కుల్దీప్‌‌ / షమీ, బుమ్రా.

న్యూజిలాండ్‌‌: విలియమ్సన్‌‌ (కెప్టెన్‌‌), గప్టిల్‌‌, నికోలస్‌‌, టేలర్‌‌, లాథమ్‌‌, నీషమ్‌‌, గ్రాండ్‌‌హోమ్‌‌, శాంట్నర్‌‌, హెన్రీ, ఫెర్గుసన్‌‌, బౌల్ట్‌‌.

పిచ్‌‌, వాతావరణం
ఫ్లాట్‌‌ వికెట్‌‌. బ్యాటింగ్‌‌కు అనుకూలం. టాస్‌‌ గెలిస్తే బ్యాటింగ్‌‌ తీసుకోవచ్చు. గత ఐదు మ్యాచ్‌‌ల్లో ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన వారే గెలిచారు. ఇక్కడ టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌‌ల్లో పైచేయి సాధించింది. మధ్యాహ్నం ఎండ వల్ల పిచ్‌‌పై బంతి ప్రభావం ఉండదు. సాయంత్రం వేళ పిచ్‌‌ మందకొడిగా తయారవుతుంది. కాబట్టి పేసర్లకు అనుకూలం. ఛేదన కష్టమవుతుంది.  వాతావరణం మేఘావృతంగా ఉంటుంది. చిరుజల్లుల వల్ల మ్యాచ్‌‌కు అంతరాయం ఉంటుంది.

మ. 3 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ లో