ఐసీడీఎస్‌ను మూసివేసే కుట్ర

ఐసీడీఎస్‌ను మూసివేసే కుట్ర

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం ఐసీడీఎస్‌ను మూసివేసేందుకు కుట్ర చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు ఆరోపించారు.  అంగన్‌వాడీ ఉద్యోగుల జీపు జాత బుధవారం సంగారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా  టీఆర్ఎస్ గార్టెన్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు స్త్రీశిశు సంక్షేమ శాఖలకు ప్రాధాన్యం ఇచ్చి ఐసీడీఎస్‌ను ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేయాలని చూస్తోందని విమర్శించారు.

అంగన్‌వాడీ సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఐసీడీఎస్‌ పరిరక్షణ, పనికితగ్గ వేతనం, ఇతర సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమాలు చేయాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్స్ , హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ ఐసీడీఎస్‌ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులను వంద శాతం కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు.

అంగన్‌వాడీ ఉద్యోగులకు తమిళనాడు మాదిరిగా గుర్తింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా జూలై 10న కోరికల దినం సందర్భంగా బ్లాక్‌ డే నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ట్రెజరర్‌‌ సునీత, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నర్సమ్మ, నేతలు శశికళ, మంగమ్మ, యాదగిరి ,నాగేశ్వరరావు, ప్రవీణ్, సంగీత, అరుణ, రూప, విజయ, నాగేశ్వరమ్మ, బాబురావు పాల్గొన్నారు.