వీడిని ఏం చేసినా పాపం లేదు : కాలం చెల్లిన పదార్థాలతో... ఐస్ క్రీం తయారు చేస్తున్నాడు 

వీడిని ఏం చేసినా పాపం లేదు : కాలం చెల్లిన పదార్థాలతో... ఐస్ క్రీం తయారు చేస్తున్నాడు 

ఏ వస్తువుకు అయినా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది.. ఈ సమయంలోపు దాన్ని ఉపయోగించాలి అని తేదీ వేస్తారు. ఆ సమయం ముగిసిన తర్వాత ఆ ఆహార పదార్థాలను పారేయాలి.. నాశనం చేయాలి. హైదరాబాద్ సిటీలో వెలుగు చూసిన ఐస్ క్రీం తయారీ కేంద్రం మాత్రం.. అందుకు భిన్నంగా జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కాలం చెల్లిన వివిధ కంపెనీల బ్రాండెడ్ ఐస్ క్రీంలు తీసుకొచ్చి.. వాటిని లోకల్ బ్రాండ్ పేరుతో లేబుల్స్ మార్చి.. కొత్తగా తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తుంది. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా.. ఐస్ క్రీం అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.. ఇలాంటి ఐస్ క్రీంను కాలం చెల్లిన వాటితో తయారు చేయటం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్​నగర్​పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరామ్​ నగర్, దిల్​సుఖ్​నగర్​లలో ఐస్​క్యూబ్​అనే సంస్థ లైసెన్స్​లేకుండా ఐస్​క్రీం తయారీ ప్లాంట్ నడుపుతుంది. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఆ ప్లాంట్లపై దాడి చేశారు. ఐస్​క్రీం తయారీ విధానం చూసి షాక్ అయ్యారు. సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో చేస్తున్న వీటిలో.. గడువు ముగిసిన పదార్థాలు కలిపినట్లు గుర్తించారు. వీటిని బ్రాండెడ్​ కంపెనీ పేర్లు పెట్టి అమ్ముతున్నారని గుర్తించారు పోలీసులు. ఈ దాడిలో యూనిట్​ నడుపుతున్న బిక్షపతి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్నాళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుంది.. ఎక్కడెక్కడ అమ్ముతున్నారు.. ఏ ప్రాంతాల్లోని షాపులకు వీటిని విక్రయించారు.. అనే విషయాలను రాబడుతున్నారు.