కొత్త గబ్బిలం జాతి గుర్తింపు

కొత్త గబ్బిలం జాతి గుర్తింపు

సికింద్రాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ భార్గవి కొత్త జాతి గబ్బిలాన్ని కనుగొన్నారు. బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్​రీడింగ్ లో పీహెచ్ డీ రీసెర్చ్ స్కాలర్ అయిన తన కొడుకు ఆదిత్య శ్రీనివాసులుతో కలిసి ఆమె కొంతకాలంగా గబ్బిలాల జాతులు, ప్రజాతులపై పరిశోధనలు చేస్తున్నారు. రీసెర్చ్ లో భాగంగా కర్నాటకలోని కొడగు జిల్లా మకుట ప్రాంతంలో పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవిలో ఒక పెద్ద భూగర్భ గుహలో ఉన్న గబ్బిలాలపై దృష్టి సారించారు.

 వాటిలో కొత్త జాతి గబ్బిలాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ కొత్త గబ్బిలం జాతికి ‘మినియోపెట్రస్ శ్రీని, శ్రీనిస్ బెంట్ వింగ్డ్ బ్యాట్’ అని పేరు పెట్టారు. బెంట్ వింగ్డ్ బ్యాట్​లు చాలా చిన్నగా ఉంటాయని, గుహలలో కొన్ని వందల సంఖ్యలో కలిసి గుంపులుగా ఉంటాయని ప్రొఫెసర్ భార్గవి తెలిపారు. వీటికి శరీరం కంటే రెండున్నర రెట్లు పొడవుగా రెక్కలు ఉంటాయన్నారు. రెక్కలను శరీరంపై ముడుచుకోవడం వల్లే వీటికి బెంట్ వింగ్డ్ బ్యాట్ అని పేరు ఉందన్నారు. 

ఈ రకం గబ్బిలాలు దక్షిణ ఐరోపా, ఆఫ్రికా, మడగాస్కర్, ఆస్ట్రేలియా, న్యూకాలెడోనియా, వనాటు వంటి దేశాల్లో కనిపిస్తాయన్నారు. మన దేశంలో బెంట్ వింగ్డ్ బ్యాట్ రకానికి చెందిన నాలుగు జాతుల గబ్బిలాలు ఉన్నాయని ఇదివరకు కనుగొన్నారని, తాము ఐదో జాతి కూడా ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.