మమ్మల్ని రెగ్యులరైజ్​చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి ఐఈఆర్పీల వినతి

మమ్మల్ని రెగ్యులరైజ్​చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి ఐఈఆర్పీల వినతి

హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్ష పరిధిలో 20 ఏండ్ల నుంచి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ఇంక్లూజీవ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్పీ)లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డిని తన ఇంటివద్ద టీఐఈఆర్‌టీఏ, టీఐఈఆర్టీయూ సంఘాల ఆధ్వర్యంలో ఐఈఆర్పీలు కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు బోయ శ్రీనివాసులు, ప్రవీణ్ కుమార్, వెంకటేశం మాట్లాడారు. ఇప్పటికే 1523 ప్రత్యేక టీచర్ల రిక్రూట్మెంట్ కు ఫైనాన్స్ శాఖ క్లియరెన్స్ ఇచ్చిందని వారు సీఎంకు వివరించారు. 

ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ద్వారా రాత పరీక్ష, రోస్టర్, రిజర్వేషన్లల ఆధారంగా తాము కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ అయ్యాయమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 996 మంది ఐఈఆర్పీలు పనిచేస్తున్నారని, వారి క్వాలిఫికేషన్లను బట్టి ప్రైమరీ, హైస్కూల్ పోస్టుల్లో క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, విద్యాశాఖ అధికారులు, న్యాయశాఖ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు విజయ, దామోదర్  చారి, మల్లేశ్ గౌడ్, సునీత, జయలక్ష్మి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.