ఎవరికీ ఇబ్బంది వద్దని 317జీవో తెస్తే రాజకీయం చేస్తుండ్రు

 ఎవరికీ ఇబ్బంది వద్దని 317జీవో తెస్తే రాజకీయం చేస్తుండ్రు
  • టెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో మంత్రి హరీష్ ముఖాముఖి

సిద్ధిపేట జిల్లా: సరైన కోచింగ్ దొరక్క గతంలో చాలా ఇబ్బందులు పడ్డారని.. అలాంటి సమస్యలు రాకుండా త్వరలోనే లాంగ్ టర్మ్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సిద్ధిపేట మండలం పొన్నాల టీర్ఎస్ పార్టీ కార్యాలయంలో టెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు, విద్యార్థులతో ముఖాముఖిలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో  34 శాతం ఉత్తీర్ణత వస్తే, కేసీఆర్ కోచింగ్ సెంటర్ నుండి 82 శాతం ఉత్తీర్ణత రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సిద్ధిపేట జిల్లాలోనే 550 గ్రూప్ 4th ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని.. వాటికోసం కూడా ఉచిత కోచింగ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్ ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు.
ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 317 జీవో తెస్తే.. దాన్ని కొన్ని రాజకీయ పార్టీలు జీర్ణించుకోక బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 317 జీవో వద్దు అంటూ రాజకీయం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రంలో  ఖాళీగా ఉన్న 95 వేల ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్మీలో ఉద్యోగాలు భర్తీ చేయండి అంటే.. అగ్ని పథ్ స్కీం తెచ్చి యువతను మోసం చేయడమే కాదు.. యువతను నిర్వీర్యం చేసి  వారి జీవితాలను నాశనం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలు కూడా అమ్మేస్తున్నారని, దేశంలో ఉపాధి అవకాశాలు కూడా లేవన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశం ఎంతో దుర్భరమైన దుస్థితికి దిగజారిపోయిందన్నారు. ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్ చెప్పడంలో బీజేపీ, బీజేపీ సోషల్ మీడియాకు డాక్టర్ రేట్ ఇవ్వాలని.. అందుకే బీజేపీ సోషల్ మీడియాను, వాటిలో వచ్చే వార్తలు తిప్పికొట్టాలని కోరారు.