హైదరాబాద్, వెలుగు: గురుకుల విద్యా సంస్థల్లో కొనుగోళ్లకు సంబంధించిన టెండర్ల విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హరీశ్ రావు చేసిన ఆరోపణలు నిజమని ఆధారాలతో సహా నిరూపిస్తే.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ప్రజల సమక్షంలోనే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.
మంగళవారం సీఎల్పీలో మీడియాతో మంత్రి మాట్లాడారు. టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తమతో సమీక్ష చేసిన అనంతరమే నిర్ణయాలు జరిగాయని చెప్పారు. సీఎం సమక్షంలో ముగ్గురు మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత కొనుగోలు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. టెండర్ల గురించి తనకు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలియదని హరీశ్ ఆరోపించడం పూర్తి అబద్ధమని అడ్లూరి అన్నారు. మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం తమది కాదని, ప్రతి నిర్ణయం పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు.
దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిందని మంత్రి గుర్తు చేశారు. ఈ టెండర్లన్నీ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా, సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించామని చెప్పారు. దోచుకొని, దాచుకోవడం తమకు తెలియదని, విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి సూచించారు.
