
న్యూఢిల్లీ: బాల్ వేయకముందే క్రీజు దాటితే ఎవరినైనా మన్కడింగ్ చేస్తానని ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఏ బ్యాట్స్‌మన్‌ను మన్కడింగ్ చేస్తావని ట్విటర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అశ్విన్ ఈ విధంగా బదులిచ్చాడు. గత సీజన్‌లో కింగ్స్ పంజాబ్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్‌ను మన్కడింగ్‌తో ఔట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ ఔట్ విషయంలో రూల్స్ ప్రకారమే అశ్విన్ నడుచుకున్నాడని కొందరు అతనికి మద్దతు తెలపగా.. క్రీడా స్ఫూర్తిని మరిచాడని మరికొందరు విమర్శించారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో రవిచంద్రన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్న విషయం తెలిసిందే.