పెట్రో ధరల మంట తప్పదు.. చమురు ధర 100 డాలర్లు దాటితే..

పెట్రో ధరల మంట తప్పదు.. చమురు ధర 100 డాలర్లు దాటితే..

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా  బ్రెంట్‌ క్రూడ్​ బ్యారెల్​ ధర ప్రస్తుతం 91 డాలర్లకు ఎగిసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ధరలు 21 శాతం పెరిగాయి.  సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే ధరలు 100 డాలర్లపైకి చేరుతాయన్నది ఎనలిస్టులు అంచనా. ఇదే జరిగితే మనదేశానికి తిప్పలు తప్పవు. ఎకానమీ నెమ్మదిస్తుంది. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. జనం కొనుగోలు శక్తి తగ్గుతుంది.

చమురు ధరల మంట  జేబుకు చిల్లు పెడుతుంది. యుద్ధం వల్ల హోర్మూజ్​జలసంధి నుంచి సుమారు 15 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా ఆగే ప్రమాదం ఉంది.  భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం కంటే ఎక్కువ దిగుమతుల ద్వారానే పొందుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 100 డాలర్లకు చేరితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది.  దిగుమతి బిల్లులు భారీగా పెరుగుతాయి.

బ్యారెల్ ధర ప్రతి 10 డాలర్లు పెరిగితే భారత్ చమురు దిగుమతి బిల్లు సుమారు 13 నుంచి 14 బిలియన్ డాలర్లు (1.28 లక్షల కోట్లు)  పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దేశ కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 0.3 శాతం పెరగొచ్చు.  ఏటా మనదేశం చెల్లించే చమురు బిల్లు 20 నుంచి 25 బిలియన్ డాలర్లు (రూ.2.30 లక్షల కోట్లు) పెరుగుతుంది. ఆయిల్‌  ధరలు 120 డాలర్లకు చేరితే చమురు వాణిజ్య లోటు 220 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇది దేశ కరెంట్ ఖాతా లోటును 3 శాతం కంటే పైకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. 

జేబుపై భారీగా భారం
చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు కూడా పెరిగి వస్తువుల తయారీ రంగంపై ప్రభావం ఉంటుంది. దాదాపు ప్రతి వస్తువు ధర పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.  ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుంది. ఇది ఆర్​బీఐ నిర్దేశించుకున్న 4 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యానికి ఇబ్బందిగా మారుతుంది. చమురు దిగుమతుల కోసం డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. మన కరెన్సీ బలహీనపడితే ఇతర దేశాల నుంచి ఎక్కువ రేట్లకు వస్తువులను కొనాల్సి వస్తుంది.

అంటే దిగుమతుల ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇలాంటి పరిస్థితులు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలపై కూడా భారం పడుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. రష్యా నుంచి 15 మిలియన్ బ్యారెల్స్ మేర  ఆయిల్ వస్తుండడంతో కొంత ఊరట లభించనుంది. రష్యా ఆయిల్ కొనేందుకు అమెరికా భారత రిఫైనరీలకు నెల గడువు ఇచ్చింది.  

ధర 150 డాలర్లకు చేరొచ్చు..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగితే రాబోయే కొన్ని వారాల్లో గల్ఫ్ దేశాల నుంచి ఇంధన ఎగుమతులు నిలిచిపోయే అవకాశం ఉంది. హోర్మూజ్‌ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు ఆగిపోతే ముడి చమురు ధర బ్యారెల్‌‌‌‌కు 150 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.  దీంతో ప్రపంచవ్యాప్తంగా జీడీపీ వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఖతార్‌‌ ఇంధన మంత్రి సాద్ అల్ కాబీ