
మరో 4 నాలుగు రోజుల్లో అంటే 2025, సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రియులంతా ఈ కాంటినెంటల్ టోర్నీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆసియా కప్ గెలిచే జట్టేదే..? అత్యధిక పరుగులు ఎవరు సాధిస్తారు..? హాయొస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచే బౌలర్ ఎవరు..? అనే అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తు్న్నారు మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు. ఈ క్రమంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై హాట్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్.
రాబోయే ఆసియా కప్‌లో టీమిండియా విజేతగా నిలవకపోతే సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్ కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదం ఉందని అన్నాడు. సెలక్టర్లు సూర్యకుమార్ యాదవ్‌ను పక్కకు పెట్టి టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్‌కు టీ20 పగ్గాలు అప్పగించే చాన్స్ ఉందన్నాడు. టీమిండియా ఆసియా కప్ గెలవకపోతే 2026 టీ20 ప్రపంచ కప్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ స్థానంలో గిల్ ఉంటాడన్నాడు. గిల్‌కు టీమిండియాకు అన్ని ఫార్మాట్ల కెప్టెన్ అయ్యే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు పనేసర్.
ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ మాట్లాడుతూ.. ‘‘యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్‌కు మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే గొప్ప సామర్థ్యం ఉంది. సూర్యకుమార్ యాదవ్ T20లలో బాగా రాణించకపోయినా.. టీమిండియా ఆసియా కప్ గెలవకపోయినా సెలెక్టర్లు అతనిని పక్కనబెట్టి టీ20 కెప్టెన్సీని గిల్‌కు అప్పగించవచ్చని నేను భావిస్తున్నాను. రోహిత్ శర్మ రిటైర్మెంట్ చేసిన తర్వాత టీమిండియాకు అన్ని ఫార్మాట్లకు గిల్ నాయకత్వం వహించే అవకాశం ఉంది’’ అని అన్నాడు.