చట్టం ముందు ఏవరైనా ఒక్కటే.. వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

చట్టం ముందు ఏవరైనా ఒక్కటే.. వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్
  • సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా 
  • ఎంపీడీవో ఇంటికి వెళ్లాననడం అబద్ధం
  • కుట్ర కోణాన్ని ఆరా తీయాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోటంరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న కోటంరెడ్డి అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. చట్టం ముందు ఏవరైనా ఒక్కటేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లు సమాచారం.  ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం   ఆదేశాలతోనే రంగంలోకి దిగిన పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యేను సైతం అరెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. రూరల్ ఎమ్మెల్యే తన ఇంటిపై దాడి చేసి తన తల్లిని దుర్భాషలాడారని ఎంపీడీవో సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇక మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. కుట్ర కోణాన్ని ఆరా తీయాలన్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తన తప్పేమీ లేదని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని కోటంరెడ్డి అన్నారు. అనుమతులు ఉన్నా ఎంపీడీవో వాటర్ కనెక్షన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తాను ఎంపీడీవో ఇంటికి వెళ్లాననడం అబద్దమని కోటంరెడ్డి చెప్పారు.