
సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ కు పేరు వస్తుందని కేసీఆర్ బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టులను ఆపించారని ఆరోపించారు. ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ దిగిపోతే పీడ పోయిందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో నుంచి రోజుకో నాయకుడు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్తున్నారని చివరకు ఆ పార్టీలో ఆ నలుగురే మిగులుతారని జోస్యం చెప్పారు.
మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత తొలిసారి కోమటిరెడ్డి స్వగ్రామంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలం లోపు బ్రాహ్మణ వెళ్లెంల కాలువలు తీయించి చెరువులు నింపుతామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్ళలో ఎస్ ఎల్ బీసీ పూర్తి చేసి సాగు నీటిని అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే నల్గొండ జెడ్పి చైర్మన్ కూడా వస్తారని చెప్పారు.
బ్రాహ్మణ వెల్లంలను మోడల్ విలేజ్ గా చేసి సోలార్ విలేజ్ గా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామానికి చెందిన 200 మంది పేదలకు తన సొంత స్థలం మూడు ఎకరాల్లో ఇల్లులు కట్టిస్తానని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో త్వరలోనే కెనరా బ్యాంకు ఏర్పాటు చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.