కేటీఆర్ సీఎం అయితే కేబినెట్ లో చాన్స్​ ఎవరికి?

కేటీఆర్ సీఎం అయితే కేబినెట్ లో చాన్స్​ ఎవరికి?
  • కేటీఆర్ కోటరీకి ప్రయార్టీ కవితకు బెర్త్ ఖాయమే!
  • ఇటీవల కేటీఆర్ కు గ్రీటింగ్స్ చెబుతున్న నేతలంతా రేసులో 
  • ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇవే ముచ్చట్లు

హైదరాబాద్, వెలుగు:  కేటీఆర్​ త్వరలోనే సీఎం అవుతారని మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసబెట్టి కోరస్ పాడుతున్నారు. కొందరు ఏకంగా అడ్వాన్స్​ గ్రీటింగ్స్​ కూడా చెప్పేస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేటీఆర్​ బాధ్యతలు ఎప్పుడు చేపడతారనే ఊహాగానాలతోపాటు ఆయన కేబినెట్​లో మంత్రులుగా ఎవరుంటారు?  ఈసారి కీలక  బెర్త్​లు ఎవరికి దక్కుతాయి? అనే చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. ఫలానా ఎమ్మెల్యేలకు ఫలానా మంత్రి పదవులు వస్తాయని చర్చించుకుంటున్నారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో ఉన్నట్టుగా కేటీఆర్  కేబినెట్ లో కూడా డిప్యూటీ సీఎం పదవి ఉంటుందని చెప్తున్నారు. కొందరు సిట్టింగ్ మంత్రులను కంటిన్యూ చేయాలని స్వయంగా కేసీఆర్ రికమెండ్ చేస్తారని, మిగతా మంత్రుల ఎంపికను కేటీఆర్ ఇష్టానికి వదిలేస్తారని అంటున్నారు. క్యాస్ట్​ ఈక్వేషన్స్​ దృష్టిలో పెట్టుకొని ఏ జిల్లా నుంచి ఏ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తారో లీడర్లు లెక్కలు తీస్తున్నారు. ప్రస్తుత మంత్రులందరికీ కేటీఆర్  కేబినెట్​లో చోటు దక్కకపోవచ్చని చెప్తున్నారు. ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వారిని పక్కన పెడ్తారని, ఆ ప్లేస్​లలో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులను కేటీఆర్​ కేబినెట్ లోకి తీసుకుంటారని లీడర్లు భావిస్తున్నారు.

కవితకూ అవకాశం

కేటీఆర్ కేబినెట్ లో ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవితకు చాన్స్ ఉంటుందా? లేదా? అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అధికార మార్పిడి జరిగితే మంత్రి పదవి కావాలని కవిత పట్టుపడుతున్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో ఆమెకు బెర్త్​ ఖాయమేనని కొందరు లీడర్లు అనుకుంటున్నారు.

మిగతా స్థానాల్లో ఎవరికి చాన్స్​

కేటీఆర్​ సీఎం బాధ్యతలు స్వీకరిస్తే ఇప్పుడున్న కేబినెట్​ రద్దవుతుంది. దీంతో మార్పులు చేర్పులు తప్పనిసరవుతాయి. రాష్ట్ర కేబినెట్ లో సీఎంతో పాటు 17 మందిని మంత్రులుగా నియమించుకునే  చాన్స్ ఉంటుంది. హరీశ్ రావు, ఈటల రాజేందర్​, కవితకు  బెర్త్​లు ఖరారైతే… మిగిలిన 14  స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై  టీఆర్​ఎస్​లో పలు రకాలుగా చర్చలు నడుస్తున్నాయి. దళితుడిని సీఎం చేయాలనే డిమాండ్​ వస్తున్నందున ఒక ఎస్సీ,  ఒక ఎస్టీకి,  ఒక ముస్లింకు కేబినెట్​లో చాన్స్​ ఖాయమని  లీడర్లే  చెప్తున్నారు. మైనారిటీ కోటాలో మంత్రి పదవి బోధన్​ ఎమ్మెల్యే  షకీల్​ను వరిస్తుందనే  ప్రచారం మొదలైంది. ఎస్సీ కోటాలో మినిస్టర్​ పదవి కోసం బాల్క సుమన్, చంటి క్రాంతి కిరణ్   ట్రై చేసే చాన్స్ ఉంది. గువ్వల బాలరాజు కూడా పోటీలో ఉంటారని పార్టీ లీడర్లు అంటున్నారు. ఎస్టీ కోటాలో కూడా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మిగతా 11 మందిలో ప్రధానంగా కేటీఆర్ కోటరీగా ముద్రపడ్డ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కవచ్చని లీడర్లు చెప్తున్నారు. ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ తోపాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవులపై ధీమాతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి  ఈ మధ్య దూకుడు పెంచినట్టు లీడర్లు చెప్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందాగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పోటీ పడ్తారని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్​ పద్మారావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి  చాన్స్ ఉంటుందనే టాక్​ మొదలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా  నుంచి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన చీఫ్ విప్​  వినయ్ భాస్కర్​ రేసులో ఉంటారని లీడర్లు భావిస్తున్నారు. కరీంనగర్  నుంచి గంగుల కమలాకర్ కూడా పోటీలో ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.  కేటీఆర్​కు సన్నిహితుడిగా పేరున్న ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా కేబినెట్​లోకి  వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారనే  ప్రచారం నడుస్తోంది. నిజామాబాద్ ​రూరల్​ ఎమ్మెల్యే  బాజిరెడ్డి గోవర్ధన్​ పేరు కూడా వినిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి రేఖా నాయక్ కు, మెదక్  జిల్లా నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని  లీడర్లు అంటున్నారు. మహబూబ్ నగర్ నుంచి మాజీ మం త్రి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్న వినోద్ కుమార్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని లీడర్లు అంటున్నారు.  కేటీఆర్ కేబినెట్ లో వెళ్లేందుకు  పద్మారావుకు చాన్స్​ ఉందనే ప్రచారం జరుగుతోంది.  తలసాని శ్రీనివాస్ యాదవ్ కేబినెట్ లో కొనసాగుతారని అంటున్నారు.

‘కేటీఆర్​ సీఎం’.. ఉత్తుత్తి ప్రచారమే: ప్రతిపక్షాలు

ప్రస్తుత సమస్యల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ను సీఎం అంటూ ఉత్తుత్తి ప్రచారం చేస్తున్నట్టు విమర్శలు చేశాయి. కొడుకును కాదు, దళితుడిని సీఎం చేయాలని డిమాండ్​ చేస్తున్నాయి.  దీంతో  టీఆర్ఎస్ పెద్దలు డైలమాలో పడినట్టు తెలిసింది.

డిమాండ్ చేసిన  లీడర్లకు కేటీఆర్ ఫోన్!

కేటీఆర్ ను సీఎం చేయాలని మాట్లాడిన మంత్రులు గంగుల కమాలకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ సీఎం పద్మారావు తో  కేటీఆర్ మాట్లాడినట్టు తెలిసింది. కొందరికి ఫోన్ చేసి మాట్లాడితే, పద్మారావుతో మాత్రం నేరుగా మాట్లాడినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలాంటి ప్రకటనలు వద్దని సూచించినట్టు తెలిసింది. మూడు రోజుల కింద కేటీఆర్ తో పాటు సికింద్రాబాద్ లో రైల్వే ఉద్యోగుల ప్రోగ్రాంకు అటెండ్ అయిన పద్మారావు ‘పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బహుశా కాబోయో సీఎం.. కేటీఆర్ కు శుభాకాంక్షలు’ అంటూ అభినందనలు చెప్పినప్పుడు కేటీఆర్ చిరు నవ్వులు చిందించారు. ప్రోగ్రాం పూర్తయ్యాక కారు ఎక్కుతూ..  ‘‘చిచ్చా ..ఎందుకు మాట్లాడినవు. మాట్లాడినోళ్లకు ఫోన్ చేసి, అట్ల మాట్లాడొద్దని చెప్పిన’’ అని పద్మారావుతో  కేటీఆర్​ అన్నట్టు తెలిసింది. అయినా పద్మారావు తన డిమాండ్ లను కొనసాగించారు. అదే రోజు సాయంత్రం కొన్ని టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో  కేటీఆర్ ను సీఎం చేయాలని ఆయన అన్నారు.

హరీశ్కు కీలక శాఖలు!

ఉద్యమ నేతలుగా ముద్రపడ్డ హరీశ్ రావు, ఈటలకు కేటీఆర్ కేబినెట్​లో బెర్త్ ఖాయమని గులాబీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరినీ దూరం పెడ్తే విమర్శలతో పాటు పార్టీలో అంతర్గత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. హరీశ్ రావుకు ప్రస్తుత ఆర్థిక శాఖతోపాటు కీలమైన ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను అప్పగించే చాన్స్ ఉందని చెప్తున్నారు.

డిప్యూటీ సీఎంగా ఈటల?

కేటీఆర్ ను సీఎం సీట్లో కూర్చోపెడ్తే మంత్రి ఈటల రాజేందర్​కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే  ఆలోచనలో  కేసీఆర్ ఉన్నట్టు టీఆర్​ఎస్​ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సీఎం పదవిని కొడుకుకు కట్టాబెట్టారనే విమర్శలకు చెక్  పెట్టేందుకు బీసీ నాయకుడైన ఈటలను డిప్యూటీ సీఎంగా చేసే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు లీడర్లు చెప్తున్నారు. ఈటలకు హెల్త్ శాఖ కంటే మెరుగైన పోర్ట్ పోలియో దక్కవచ్చని అంటున్నారు. అయితే డిప్యూటీ సీఎం పదవిపై కేటీఆర్ కు అత్యంత సన్నిహిత మంత్రిగా ముద్రపడ్డ  శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా ప్రచారంలో ఉంది.