సరైన నిఘా ఉండి ఉంటే..NEET లీకయ్యి ఉండేది కాదు: NTAపై సుప్రీంకోర్టు ఆగ్రహం

సరైన నిఘా ఉండి ఉంటే..NEET లీకయ్యి ఉండేది కాదు: NTAపై సుప్రీంకోర్టు ఆగ్రహం

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణ కమిటీలు, భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో ప్రశ్నాపత్రం లీక్ ఎలా జరిగిందని కోర్టు ప్రశ్నించింది. కమిటీ సిఫార్సుల అమలుపై నిజంగా ఎంత పర్యవేక్షణ జరిగిందో వివరించాలని జస్టిస్ నరసింహ ప్రశ్నించారు. పర్యవేక్షణ కొనసాగుతున్నప్పటికీ లీక్ జరగడం వ్యవస్థలో లోపాలను సూచిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జవాబుదారీతనం లేకుండా కేవలం సంస్కరణలతో సమస్యలు పరిష్కారం కావని కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఉన్నత స్థాయి కమిటీ తరఫున మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. పరీక్షల భద్రత కోసం మొత్తం 101 సిఫార్సులు చేసినట్లు తెలిపారు. వాటిలో 60 స్వల్పకాలిక చర్యలు ఇప్పటికే అమలులోకి వచ్చాయన్నారు. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో లోపాల వల్లే ఈ సమస్య తలెత్తిందని, ఇప్పుడు ఆ ప్రక్రియను మరింత పటిష్టం చేస్తున్నామన్నారు. 

జూన్ 21న జరగనున్న రీ-టెస్ట్‌కు ముందు కొత్త సెక్యూరిటీ సిస్టమ్ ను అమలు చేస్తున్నామని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ప్రధానమంత్రి స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రతియేటా పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు శాశ్వత సంస్థాగత వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు సూచించింది.

విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని కోర్టు పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్‌టిఎను మరింత బలోపేతం చేయాలని కేంద్రానికి ఆదేశించింది.