రాహుల్​ జనంలోకి వెళ్తుంటే..బీజేపీకి ఎందుకంత భయం : జగ్గారెడ్డి

రాహుల్​ జనంలోకి వెళ్తుంటే..బీజేపీకి ఎందుకంత భయం : జగ్గారెడ్డి
  •  మోదీ మెప్పు కోసమే అస్సాం సీఎం యాత్రను అడ్డుకుంటున్నరు : జగ్గారెడ్డి
  • గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను సీఎం కలిసేవారా?
  • తొమ్మిదేండ్లలో దక్కని అవకాశం.. 2 నెలల్లోనే రేవంత్​ కల్పించారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాహుల్​ గాంధీ జనాల్లోకి వెళ్తుంటే బీజేపీకి ఎందుకంత భయమని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి ప్రశ్నించారు. వాళ్లు న్యాయమైన పాలన చేయడం లేదు కాబట్టే రాహుల్​గాంధీ న్యాయ్​ యాత్ర చేస్తున్నారన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘జనానికి ఇబ్బంది కలగకుండా రాహుల్​అస్సాంలో యాత్ర చేస్తున్నారు. కానీ, ఆ స్టేట్​ సీఎం హిమంత బిశ్వశర్మ యాత్రను అడ్డుకుంటున్నారు.

రాహుల్​గుడికి వెళ్లాలంటే సీఎం పర్మిషన్​ తీసుకోవాలా? అస్సాం ప్రభుత్వమే అక్కడ కావాలని లా అండ్​ ఆర్డర్​ సమస్యను సృష్టించింది. ప్రధాని మోదీ మెప్పు కోసమే రాహుల్​యాత్రను అస్సాం సీఎం అడ్డుకుంటున్నారు. ఒకప్పుడు హిమంత బిశ్వశర్మ కూడా కాంగ్రెస్​ గూటి పక్షేనన్న విషయం గుర్తుంచుకోవాలి. రాహుల్​ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది’’ అని ఆయన పేర్కొన్నారు. 

వాళ్ల తప్పులను కప్పిపుచ్చేందుకు తమపై కేటీఆర్​ ఆరోపణలు​ 

గత ప్రభుత్వంలో సీఎంను ఎమ్మెల్యేలు కలవడం కుదిరేది కాదని.. కానీ, తొమ్మిదేండ్లలో దక్కని అవకాశం సీఎం రేవంత్​ రెడ్డి 2 నెలల్లోనే కల్పించారని జగ్గారెడ్డి అన్నారు. తొమ్మిదేండ్లలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్​పై కేటీఆర్​ ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతం గురించి కేటీఆర్​ మాట్లాడితే.. వాళ్ల గతం గురించి తాము మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్​ ఒకప్పుడు యూత్​ కాంగ్రెస్​ నాయకుడిగా పనిచేశారని గుర్తుచేశారు.

ఆయన ఎక్కడా పనిచేయకుండా ఉండి ఉంటే రేవంత్​ గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. కేసీఆర్​ ఎక్కడా రాజకీయాలు చేయకుండానే డైరెక్ట్​గా బీఆర్​ఎస్​పెట్టారా అని ప్రశ్నించారు. రేవంత్​ గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్​కు లేదని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ చంపేసిన ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్​ బతికించిందన్నారు. ప్రతిపక్ష సభ్యుల గొంతును బీఆర్​ఎస్​ నొక్కేసిందని ఫైర్​అయ్యారు.

రాముడిని మొక్కాలని బీజేపీ వాళ్లు చెప్పాల్నా

శ్రీరాముడిని మొక్కాలంటూ బీజేపీ వాళ్లు చెప్పాలా అని జగ్గారెడ్డి నిలదీశారు. దేవుడు పుట్టిన తర్వాత బీజేపీ పుట్టిందా.. బీజేపీ పుట్టిన తర్వాత దేవుడు పుట్టాడా? అని ప్రశ్నించారు. రాహుల్​ గాంధీ ఇంట్లో దేవుడిని మొక్కరా.. ఆ ఫొటోలు కూడా పెట్టాలా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు సీతారాముల కల్యాణం చేస్తారో లేదో తెలియదు కానీ, ఏటా తాను మాత్రం సీతారాముల కల్యాణం చేయిస్తానని చెప్పారు. కవిత లేకుంటే బతుకమ్మ పండుగే లేనట్టు ఆమె సినిమా చూపించారని, ఇప్పుడు రామాలయం పేరుతో ప్రధాని మోదీ సినిమా చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. అయోధ్య రామాలయానికి కారకుడు అద్వానీ అని జగ్గారెడ్డి గుర్తు చేశారు.