మహిళా సంఘాలు వ్యాపారం చేస్తామంటే కోటి రూపాయలు రుణం

మహిళా సంఘాలు వ్యాపారం చేస్తామంటే కోటి రూపాయలు రుణం
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ అర్బన్: మహిళా సంఘంలోని మహిళలు ఏదైనా మంచి వ్యాపారం చేసుకుంటామంటే కోటి రూపాయల వరకైనా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ లో జరిగిన స్వశక్తి సంఘాలకు రుణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఎన్ని సంఘాలకు అవసరమున్నా 3 లక్షల చొప్పున లోన్లు ఇస్తామన్నారు. ఇవాళ ఒక్కరోజే మహిళా సంఘాలకు 30 కోట్ల రుణాలు ఇస్తున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న 10 కోట్ల రుణాలకు సంబంధించిన వడ్డీ కూడా విడుదల చేస్తున్నామన్నారు. 
వ్యవసాయాధారిత పరిశ్రమలు పెడితే ప్రోత్సహిస్తాం 
మహిళా సంఘాల సభ్యులు వ్యవసాయాధారిత పరిశ్రమలు పెడితే ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తిపారు. మహిళలకు ఐదారు రోజుల్లో ఇక్కడ వృత్తి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయిస్తామన్నారు. మహిళా సంఘాల ఎదుగుదల వల్ల వారి భర్తలే డబ్బుల కోసం భార్యల దగ్గర చేయిచాచే రోజులొచ్చాయని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో ఇచ్చేదే 500 పింఛన్, అది కూడా కరోనా వల్ల ఆర్నెళ్లుగా ఇవ్వడం లేదని అక్కడి మహిళలు ఇటీవల నేను అక్కడికి వెళ్తే చెప్పారని ప్రస్తావిస్తూ.. ఇక్కడ మాత్రం ఎంత కష్టమైనా అందరికీ 2 వేల ఫించన్ ఇస్తున్నామన్నారు. వృద్ధాప్య ఫించన్ 57 ఏళ్లకే ఈనెల 15 నుంచి ఫించను ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, అందరూ సీఎం కేసీఆర్ ను అభినందించాలన్నారు. కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది,  ఎమ్మెల్యే ధర్మారెడ్డిది అని, కమలాపూర్ మండలాన్ని జిల్లాలో ఆదర్శ జిల్లాగా తీర్చుదిద్దుతామన్నారు. మహిళా గ్రూపులకు భవనాలు రెండు మూడు రోజుల్లో మంజూరీ ఇప్పించే బాధ్యత నాది అన్నారు. మహిళలు వ్యాపారాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కమలాపూర్ మండలాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత నాది, కేసీఆర్ ను మనం కాపాడుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చి ఏవేవో చెబుతాయని, మీరున్న రాష్ట్రాల్లో ఫించన్లు ఎంతిస్తున్నారని, కల్యాణ లక్ష్మి ఇస్తున్నారా? అని ప్రశ్నించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. హుజురాబాద్ నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు మంజూరైనా మీ ఎమ్మెల్యే(ఈటల) ఇక్కడ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, గతంలో మంజూరైన ఇళ్లతో పాటు ఎవరైనా సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే నేను డబ్బులిప్పిస్తానన్నారు.