కరోనాను నిర్లక్ష్యం చేస్తే.. కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం

కరోనాను నిర్లక్ష్యం చేస్తే.. కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం
  • కరోనా నిర్ధారణ పరీక్షలు అన్ని ఆస్పత్రుల్లో యధాతథం
  • కరీంనగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ  అధికారి డా.సుజాత

కరీంనగర్: కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని.. ఏమాత్రం అజాగ్రత్త వహించినా కరోనా కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం కనిపిస్తోందని కరీంనగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ  అధికారి డా.సుజాత హెచ్చరించారు. కరోనా ఇంకా పూర్తిగా పోలేదని.. వ్యాక్సిన్ వచ్చిందని నిర్లక్ష్యం వహించడం మంచిదికాదని ఆమె ఒక ప్రకటనలో సూచించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని మండల, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ఏరియా ఆసుపత్రులలో  కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయని.. జలుబు, జ్వరము మరియు దగ్గు లాంటి లక్షణాలు ఉంటే, ఆలస్యము చేయకుండా వెంటనే తమకు దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. కోవిడ్ నిబంధనల పట్ల   నిర్లక్ష్యం వల్ల పలు రాష్ట్రాలలో కోవిడ్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా‌ పెరుగుతోందని, నిర్లక్ష్యం వహిస్తే మన దగ్గర కూడా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.  స్కూల్స్, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించడంతోపాటు భౌతిక దూరము పాటించాలన్నారు.  శుభకార్యములు, అంత్యక్రియలు తదితర కార్యక్రమములలో పాల్గొనే వారు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని డాక్టర్ సుజాత తెలిపారు.

ఇవి కూడా చదవండి

వచ్చే నెల దాకా ఫాస్టాగ్‌ స్టికర్​​ ఫ్రీ

చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!

నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు