పరీక్షను రద్దు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పరీక్షను రద్దు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష 48 గంటల్లో రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు  ఆస్థులు అమ్ముకొని వాళ్ల పిల్లల్ని చదివిస్తుంటే టీఎస్పీఎస్సీ వ్యవహరించిన తీరు చాలా బాధకరమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. 

గతంలో తాను కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పని చేశానని వెల్లడించారు. చైర్మన్ కు తప్ప మరెవరికి తెలియని పాస్వర్డ్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల వద్దకు ఎలా వెళ్ళిందో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. కారుణ్య నియామాకాల్లో అపాయింట్ అయిన ప్రవీణ్ అనే వ్యక్తి.. తన ప్రియురాలి కోసం కాన్ఫిడెన్సియల్  మెటీరియల్ తీసుకున్నారంటే శోచనీయమని అన్నారు. సివిల్స్ ఎగ్జామ్స్  కోసం రాత్రింబవళ్లు చదివినా ప్రిలిమినరీ ఎగ్జామ్ సాధించడం కష్టం. కానీ, ప్రవీణ్ మాత్రం గ్రూప్ 1 పరీక్షల్లో 150 మార్కులకు 103 మార్కులు ఎలా సాధించాడో చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

ముఖ్యమంత్రికి నిరుద్యోగుల జీవితాలమీద శ్రద్ధ లేదని, టీఎస్పీఎస్సీ.. నిరుద్యోగులను హీనంగా చూస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శించారు. చైర్మన్ గా జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన పరీక్షలన్ని రద్దు చేయాలని, జనార్దన్ రెడ్డిని చైర్మన్ పదవి నుండి తొలగించి సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.