పాక్, భారత్ మధ్య యుద్ధం వస్తే.. ఎవరి బలమెంత? సైన్యం, ఆయుధ సంపత్తిలో ఆధిక్యం ఎవరిది

పాక్, భారత్ మధ్య యుద్ధం వస్తే.. ఎవరి బలమెంత? సైన్యం, ఆయుధ సంపత్తిలో ఆధిక్యం ఎవరిది
  • ఇండియన్ ఆర్మీ సిబ్బంది సంఖ్య 14.75 లక్షలు
  • పాక్ సైనిక సిబ్బంది 6.6 లక్షల మందే 

న్యూఢిల్లీ:  పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) వద్ద పాకిస్తాన్ రోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటంతో భారత్ దీటుగా ప్రతిస్పందిస్తున్నది. దీంతో  భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవేళ యుద్ధం వస్తే.. ఇరు దేశాల సైనిక బలగాల సంఖ్య ఎంత? వాటి సామర్థ్యాలు ఏమిటి ? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.  

సైన్యం, ఆయుధ సంపత్తిలో మనదే ఆధిక్యం

స్వీడన్ లోని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ స్టాక్‌‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌‌స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) ప్రకారం.. భారత్‌‌లో 14.75 లక్షల సైనికులు ఉన్నారు. అంతేగాక.. మరో 16.16 లక్షల మంది పారామిలటరీ పోలీసులు కూడా ఉన్నారు. ఇక ఆయుధాల విషయానికి వస్తే.. మన వద్ద 1,437 ఫిక్సెడ్-వింగ్ విమానాలు, 995 హెలికాప్టర్లు, 7,074 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్, 11,225 ఆర్టిలరీ యూనిట్లు ఉన్నాయి. 

ప్రధానంగా ల్యాండ్-బేస్డ్ న్యూక్లియర్ మిసైల్స్ పై మన దేశం ఎక్కువగా ఆధారపడుతున్నది. వైమానిక, సబ్‌‌మెరైన్ ద్వారా కూడా న్యూక్లియర్ బాంబులను ప్రయోగించగలదు. ఇంటర్మీడియట్-రేంజ్ మిస్సైల్స్ తో పాటు ఇంటర్‌‌కాంటినెంటల్-రేంజ్ క్షిపణులను కూడా మన దేశం పరీక్షిస్తున్నదని ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది. 2025 బడ్జెట్‌‌లో రక్షణ రంగానికి కేంద్రం రూ. 6.81 లక్షల కోట్లు కేటాయించింది.  

పాక్ సైనిక బలమెంతంటే.. 

ఎస్ఐపీఆర్ఐ ప్రకారం.. పాకిస్తాన్‌‌లో కేవలం 6.6 లక్షల క్రియాశీల సైనిక సిబ్బంది మాత్రమే ఉన్నారు. భారత్‌‌తో పోలిస్తే ఇది సగానికి తక్కువ. ఆ దేశ పారామిలిటరీ బలగాల సంఖ్య 2.91 లక్షలు మాత్రమే. ఇక ఆయుధ సంపత్తిలో పాకిస్తాన్ వద్ద 812 యుద్ధ విమానాలు, 322 హెలికాప్టర్లు, 6,137 ఏఎఫ్‌‌వీలు, 4,619 ఆర్టిలరీ యూనిట్లు ఉన్నట్లు డేటా తెలిపింది. 

అయితే, సాయుధ పోరాట వాహనా(ఏఎఫ్‌‌వీ)ల విషయంలో ఇరు దేశాల మధ్య అంతరం మరీ ఎక్కువగా లేదని ఈ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ కూడా భూమి, గగనతలం ఆధారిత న్యూక్లియర్ దాడి సామర్థ్యాలను కలిగి ఉంది. మధ్య, స్వల్ప, సమీప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పాక్ అమ్ములపొదిలో ఉన్నాయి. జలాంతర్గామి నుంచి ప్రయోగించగల అణు సామర్థ్యంగల క్రూయిజ్ క్షిపణుల కొనుగోలు కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. 

దీనికోసం పాక్ ప్రభుత్వం తన బడ్జెట్ లో  64 వేల కోట్లు కేటాయించింది. మొత్తంగా భారత్ తో పోలిస్తే పాక్..సైన్యం, ఆయుధ సంపత్తిలో  తక్కువ స్థాయిలోనే ఉంది.