మేం తిట్టుడు స్టార్ట్​ చేస్తే ప్రధానిని కూడా వదలం

మేం తిట్టుడు స్టార్ట్​ చేస్తే ప్రధానిని కూడా వదలం
  • ప్రతిపక్షాలను ఎట్ల తన్ని తరిమేయాలో ఆలోచిస్తున్నం
  • కేసీఆర్​ను ప్రతి అడ్డమైనోడూ తిడుతున్నడు: కేటీఆర్​
  • ఒకటీరెండు ఎలక్షన్లు గెలువంగనే ఎగిరి పడుతున్నరు
  • కేసీఆర్​ గులాబీ జెండాఎత్తకపోతే మీ దిక్కుమాలిన బతుకులకు విలువెక్కడిదని కామెంట్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: తాము తిట్టుడు స్టార్ట్​ చేస్తే ప్రధానమంత్రిని కూడా వదలమని, కేంద్ర మంత్రులని కూడా చూడమని టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ అన్నారు. ప్రతిపక్షాలను ఎట్ల తన్ని తరిమేయాలో ఆలోచిస్తున్నామని హెచ్చరించారు. ‘‘ఆనాడు కేసీఆర్​ గులాబీ జెండా ఎత్తకపోతే మీ బతుకులకు విలువెక్కడిది?  మీ దిక్కుమాలిన బతుకులకు ఓ అస్థిత్వం వచ్చేదా? ఒకటీరెండు ఎలక్షన్లు గెలువంగనే ఎగిరెగిరి పడుతున్నరు. సీఎం కేసీఆర్​పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు. ప్రతి అడ్డమైనోడూ తిడుతున్నడు. మా ఓపికకు ఓ హద్దు ఉంటది” అని మండిపడ్డారు. టీ కాంగ్రెస్​, టీ బీజేపీ దుకాణాలు వచ్చాయంటే అది కేసీఆర్, తెలంగాణ ప్రజల బిచ్చమని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం టీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్​ మాట్లాడారు. నిన్న మొన్న పుట్టిన నేతలు, ఒకటి రెండు సీట్లు గెలిచిన పార్టీల వారు.. అడ్డమైన ముచ్చట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్​ నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు 2 సార్లు అధికారం అప్పగించారని, అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల లాగా సీఎం కేసీఆర్​ తీసుకెళ్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అప్పుడు సీఎంలనే ఉరికిచ్చినోళ్లం

తమ ఓపికను అసమర్థతగా భావించొద్దని, ఇరవయ్యేండ్లలో చాలా చూశామని కేటీఆర్​ అన్నారు. ‘‘ప్రతిపక్షాల తీరు చూస్తున్నం. రానున్న రోజుల్లో ఎట్ల బుద్ధిచెప్పాలో, ఎట్ల తన్ని తరిమెయ్యాలో అనే విషయాన్ని టీఆర్​ఎస్​ ఆలోచిస్తున్నది. అప్పుడున్న ముఖ్యమంత్రులను ఉరికిపిచ్చిన చరిత్ర టీఆర్​ఎస్​కు ఉన్నదా లేదా గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రతిపక్షాల మాటలు వింటున్న. ఓపికకు హద్దులుంటయ్. ఓపిక నశిస్తే మీ ప్రధాన మంత్రిని, మీ కేంద్ర మంత్రులను కూడా ఇడిసిపెట్టం. మేం మాట్లాడాల్సి వస్తే మీకంటే ఎక్కువగా మాట్లాడుతం.. నోరే వాడాల్సి వస్తే మీకంటే ఎక్కువగా వాడుతం” అని హెచ్చరించారు. ‘‘ఉమ్మడి ఏపీ​లో ఆంధ్రా నాయకుల ముందు చేతులు కట్టుకొని నిలబడ్డ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నరు.  ఆనాడు మీ బతుకులేందో గుర్తుతెచ్చుకోవాలి. తెలంగాణ ప్రజల కోసం అప్పుడు రాజీనామాలు చెయ్యుమంటే  ఒక్కడైన కాంగ్రెసోడు, బీజేపోడు రాలేదు. చీకటిలో చిరుదివ్వెలా ఉన్నది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్” అని కేటీఆర్​ అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఆనాడు కేసీఆర్​కు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నరు. అప్పుడు మజిల్​పవర్​ లేదు, మనీ పవర్​ లేదు. మీడియా పవర్​ లేదు. ఏదీ కూడా అనుకూలంగా లేదు. పట్నంల పైసలుగల్లోల్లు, హైదరాబాద్​లో ఉండే పెద్ద, పెద్ద బడా సేట్లు అందరు తెలంగాణను వద్దన్నవాళ్లే.  మీడియా పెద్ద మనుషులు కూడా ఆనాడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే. అయినా కూడా కేసీఆర్​ ముందుకు అడుగేసి పార్టీ పెట్టిండు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు” అని ఆయన పేర్కొన్నారు.

మండలాల వారీగా సోషల్​ మీడియా టీమ్​లు

రాజన్నసిరిసిల్ల జిల్లాలో నియోజకవర్గానికి 50 వేల చొప్పున టీఆర్​ఎస్​ సభ్యత్వాలు చేపట్టాలని పార్టీ లీడర్లకు కేటీఆర్​ సూచించారు. మార్చిలో పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందని, మండలాల వారీగా సోషల్​ మీడియా టీంలను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పారు. ఏప్రిల్​లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు. త్వరలోనే టీఆర్​ఎస్​ కార్యకర్తలకు ట్రైనింగ్​ ప్రోగ్రాంలు నిర్వహిస్తామని చెప్పారు.

For More News..

రోగాలపై స్పెషల్ ఫోకస్.. ఫైలెట్‌ ప్రాజెక్టు తెలంగాణలో సక్సెస్

జనరల్​ పబ్లిక్​కు వచ్చే నెలలో వ్యాక్సిన్

హుజూర్​నగర్​.. సాగర్ హామీలు సేమ్ టు సేమ్