ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2022 టోర్నీ టైటిల్ పోరులో ఇగా స్వైటెక్ అదరగొట్టింది. ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ విజేతగా ఆమె నిలిచింది. ఈ ట్రోఫీని గెలిచిన తొలి పోలెండ్ మహిళగా ఇగా రికార్డులకెక్కింది. అంచనాలకు తగ్గట్టుగా ఆడిన ఈ పోలెండ్ స్టార్ ప్లేయర్.. ఫైనల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి ట్రోఫీ ఎగరేసుకుపోయింది.
6-2,7-6 తేడాతో ట్యునీషియా ప్లేయర్, ఐదో సీడ్ ఆన్స్ జాబెర్ను ఓడించి సత్తా చాటింది. యూఎస్ ఓపెన్లో ఇదే ఆమెకు తొలి టైటిల్. దీంతో స్వైటెక్ తన కెరీర్ లో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించినట్లైంది. ఆమె 2020, 2022లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకొంది. తాజా విజయంతో ఆమె ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ ను బలోపేతం చేసుకుంది.
