ఎకో ఫ్రెండ్లీ కూలింగ్ గ్యాస్‌తో పర్యావరణం సేఫ్ ..హైడ్రో ఫ్లోరో కార్బన్స్కి బదులుగా వాడితే మేలు 

ఎకో ఫ్రెండ్లీ కూలింగ్ గ్యాస్‌తో పర్యావరణం సేఫ్ ..హైడ్రో ఫ్లోరో కార్బన్స్కి బదులుగా వాడితే మేలు 
  • ‘హెచ్ఎఫ్‌వో 1234 వైఎఫ్​’ తయారీకి ఐఐసీటీ శాస్త్రవేత్తల ఫార్ములా
  • దేశంలో తొలిసారిగా గ్రీన్ రిఫ్రిజిరెంట్ ప్రాసెస్ టెక్నాలజీ  
  • ఓజోన్‌ పొరకు నష్టం జీరో.. 11 రోజుల్లోనే విచ్ఛిన్నం

హైదరాబాద్, వెలుగు: ఎయిర్ కండీషనర్లు (ఏసీ), కార్లు, రిఫ్రిజిరేటర్ల వల్ల పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్‌కు అడ్డుకట్ట వేసే దిశగా మన సైంటిస్టులు సరికొత్త టెక్నిక్ కనుగొన్నారు. పర్యావరణానికి హాని కలిగించని నెక్స్ట్-జెనరేషన్ కూలింగ్ గ్యాస్ అయిన హెచ్ఎఫ్​వో1234వైఎఫ్​ (హైడ్రో ఫ్లోరో ఓలిఫిన్) ఉత్పత్తి కోసం దేశీయ సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పరిశోధకులు.. ఈ స్వదేశీ ప్రక్రియకు రూపకల్పన చేశారు.

తద్వారా పర్యావరణ అనుకూల కూలింగ్ టెక్నాలజీలో అంతర్జాతీయ దిగ్గజాల గుత్తాధిపత్యానికి తెరదించుతూ, భారత్‌ స్వయంసమృద్ధి సాధించేందుకు బాటలు వేశారు. ప్రస్తుతం ఏసీలు, ఫ్రిజ్‌లలో ఎక్కువగా వాడుతున్న హైడ్రో ఫ్లోరో కార్బన్లు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇవి ఓజోన్ పొరను నేరుగా దెబ్బతీయకపోయినా, కార్బన్ డయాక్సైడ్‌ కంటే వేల రెట్లు ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్‌ను పెంచుతాయని ఇప్పటికే పలు స్టడీలు తేల్చాయి.

అందుకే దానికి హెచ్ఎఫ్‌వో1234వైఎఫ్ మంచి ప్రత్యామ్నాయమని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ హెచ్ఎఫ్‌వోతో ఓజోన్‌కు ఎలాంటి ముప్పు ఉండదని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న హెచ్‌ఎఫ్‌సీలు వాతావరణంలో దాదాపు 14 ఏళ్ల పాటు తిష్టవేసి భూతాపాన్ని పెంచుతున్నాయి. కానీ ఈ కొత్త హెచ్ఎఫ్​వో గ్యాస్ కేవలం 11 రోజుల్లోనే వాతావరణంలో సహజంగా విచ్ఛిన్నమైపోతుందని చెబుతున్నారు. అందువల్ల గ్లోబల్ వార్మింగ్ పెంచే ముప్పు ఇందులో నామమాత్రంగానే ఉంటుందని చెబుతున్నారు. 

త్వరలోనే కమర్షియల్‌ స్థాయిలో ఉత్పత్తి..  

ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎఫ్​వో తయారీ విధానాలపై విదేశీ బహుళజాతి కంపెనీల పేటెంట్ల గుత్తాధిపత్యం నడుస్తోంది. దీనివల్ల ప్రస్తుతం వాడుతున్న గ్యాస్ కంటే హెచ్ఎఫ్​వో దాదాపు 30 నుంచి 40 రెట్లు ఎక్కువ ధర పలుకుతోంది. విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవడం మన ఇండస్ట్రీలకు తలకుమించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) సహకారంతో ఐఐసీటీ శాస్త్రవేత్తలు 2018 నుంచి పరిశోధనలు ప్రారంభించారు.

స్థానికంగా లభించే ముడిపదార్థాలతో, పర్యావరణ హితమైన సరళ ప్రక్రియతో దీన్ని తయారుచేసే పద్ధతిని విజయవంతంగా రూపొందించారు. త్వరలోనే దీనిని కమర్షియల్ స్థాయిలో ఉత్పత్తి చేసేలా కంపెనీలకు ఆ సాంకేతికతను బదిలీ చేసేందుకు ఐఐసీటీ కసరత్తులు చేస్తున్నది.