రాష్ట్రంలో సర్కార్ దవాఖాన్లకు పోతున్నోళ్లు  36 శాతమే

రాష్ట్రంలో సర్కార్ దవాఖాన్లకు పోతున్నోళ్లు  36 శాతమే
  • ప్రైవేట్ ఆస్పత్రులకే 64%  మంది 
  • దేశంలో చివరి నుంచినాలుగో స్థానంలో రాష్ట్రం
  • సర్కార్ ఆస్పత్రుల్లో పేషెంట్లను సక్కగా పట్టించుకోరన్న జనం 
  • ఐఐపీఎస్ సర్వేలో వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 36.2 శాతం మంది మాత్రమే ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకుంటున్నారని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్‌‌ (ఐఐపీఎస్) ఇటీవల దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో వెల్లడైంది. మిగతా 63.8 శాతం మంది ట్రీట్ మెంట్ కోసం ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నట్టు తేలింది. దేశంలో సగం మంది (49.9 శాతం) ప్రభుత్వ దవాఖాన్లకు పోతుండగా, దేశ సగటు కంటే మన రాష్ట్రం వెనుకబడి ఉందని సర్వే పేర్కొంది. అత్యల్పంగా బీహార్‌‌‌‌లో 19 శాతం మంది మాత్రమే ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్ మెంట్ చేయించుకుంటుండగా... ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌‌ (25 శాతం), మహారాష్ట్ర(36.1 శాతం) ఉన్నాయి. వీటి తర్వాత చివరి నుంచి నాలుగో స్థానంలో మన రాష్ట్రమే ఉంది. ఇక దేశంలో అత్యధికంగా కేరళలో 76 శాతం మంది, తమిళనాడులో 65 శాతం మంది ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది. 

కారణాలేంటంటే... 

ప్రభుత్వ దవాఖాన్లకు వెళ్లకపోవడానికి జనం చెప్పిన కారణాలను కూడా సర్వే వెల్లడించింది. పేషెంట్లను అస్సలు పట్టించుకోరని, కేర్ తీసుకోరని మన రాష్ట్రంలో సగం మంది చెప్పడం గమనార్హం. తాము ఉండే ప్రాంతంలో ప్రభుత్వ దవాఖాన అందుబాటులో లేకపోవడం వల్లే తాము ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయించాల్సి వస్తోందని 40 శాతం మంది చెప్పారు. ప్రభుత్వ దవాఖాన్లను రాత్రి పూట మూసేయడం, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, గంటల కొద్దీ వెయిట్ చేయించడం, టెస్టుల కోసం రోజుల తరబడి తిప్పించడం, హాస్పిటల్‌‌‌‌లో ఉండే అపరిశుభ్రత వంటి కారణాలను ఎక్కువ మంది చెప్పినట్టుగా సర్వే పేర్కొంది. దాదాపు దేశవ్యాప్తంగా ఇవే కారణాలను ఎక్కువ మంది చెప్పడం గమనార్హం. 

గతంలో కంటే బెటరే.. 

మన రాష్ట్రంలో 22 నుంచి 28 శాతం మంది మాత్రమే గవర్నమెంట్ హాస్పిటళ్లకు వెళ్తున్నట్టు గతంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వేలో వెల్లడైంది. ఇప్పుడు ఐఐపీఎస్ సర్వేలో ఈ సంఖ్య 36 శాతానికి పెరిగింది. ఈ లెక్కన గతంలో కంటే కొంత మెరుగైనట్టు చెప్పొచ్చు. ప్రైవేట్ హాస్పిటళ్లలో పెరిగిన బిల్లుల భారం, కరోనాతో ప్రభుత్వ దవాఖాన్లలో సౌలతులు మెరుగుపర్చడం వంటివి ఇందుకు కారణాలై ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.