ఫిజిక్స్ వాలా సెంటర్‌లో ఇసుకేస్తే రాలనంత జనం.. గురుగ్రామ్ వీడియో వైరల్

ఫిజిక్స్ వాలా సెంటర్‌లో ఇసుకేస్తే రాలనంత జనం.. గురుగ్రామ్ వీడియో వైరల్

ఈ రోజుల్లో ఐఐటీ-జేఈఈ, నీట్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ 'ఫిజిక్స్ వాలా' క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చూపించే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్ సెక్టార్ 16లో ఉన్న ఫిజిక్స్ వాలా కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా.. విద్యా వ్యవస్థలోని లోపాలను కూడా ఎత్తిచూపుతోంది.

అడ్మిషన్ల కోసం వచ్చిన వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆ కోచింగ్ సెంటర్ కిక్కిరిసిపోయింది. అక్కడ చదువుతున్న ఒక విద్యార్థి పంపిన ఈ ఫుటేజీని చూస్తే.. ఆ ప్రాంగణంలో కనీసం నడవడానికి కూడా స్థలం లేనంతగా జనం గుమిగూడారు. ఇన్‌స్టిట్యూట్ లోపల ఉన్న ఇరుకైన కారిడార్లు, మెట్లపై వందలాది మంది క్యూ లైన్లలో నిలబడి ఉండటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అడ్మిషన్ల సీజన్ ప్రారంభం కావడంతో సీట్ల కోసం తల్లిదండ్రులు ఎంతగా ఎగబడుతున్నారో ఇది నిరూపిస్తోంది.

అయితే ఈ విపరీతమైన రద్దీపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఒక నెటిజన్ తాను స్వయంగా ఆ సెంటర్‌కు వెళ్లానని చెబుతూ.. అక్కడ వాతావరణం చూస్తుంటే ఒక విద్యాసంస్థలా కాకుండా హాస్పిటల్ ఓపీడీ వార్డులా అనిపించిందని కామెంట్ చేశారు. ఎక్కడ చూసినా కౌన్సిలర్ డెస్క్‌లు, గదులు ఉండటం మెడికల్ కన్సల్టేషన్‌ను తలపించిందని పేర్కొన్నారు. ప్రైవేట్ ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లు పెరిగిపోవడం మన విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని మరికొందరు అభిప్రాయపడ్డారు.

►ALSO READ | 25 నిమిషాలు.. ఏసీ లేదు.. లైట్లు లేవు.. విమానంలో నరకం

ఈ క్రేజ్ వెనుక ఉన్న ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. భద్రతా ప్రమాణాలు. అంత పెద్ద సంఖ్యలో జనం ఒకే చోట, ముఖ్యంగా మెట్లపై గుమిగూడటం వల్ల తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ.. విద్యార్థుల భద్రతకు సరైన ఏర్పాట్లు చేయడం లేదనే విమర్శలు పెరిగాయి. ఏదైనా ప్రమాదం జరిగే వరకు అధికారులు నిద్రపోకూడదని.. వెంటనే ఇలాంటి సంస్థల యాజమాన్యాలపై తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ వైరల్ వీడియో దేశంలో ఐఐటీ, నీట్ కోచింగ్‌లకు ఉన్న క్రేజ్‌ను, కార్పొరేట్ కోచింగ్ సంస్థల్లో ఉన్న లోపాలను కళ్లకు కట్టింది.