ఇన్‎‎స్టాలో సీజేపీ మద్దతు వీడియోలు డిలీట్ చేయండి: విద్యార్థులకు IIT మద్రాస్ అల్టిమేటం

ఇన్‎‎స్టాలో సీజేపీ మద్దతు వీడియోలు డిలీట్ చేయండి: విద్యార్థులకు IIT మద్రాస్ అల్టిమేటం

చెన్నై: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన, ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా ఇన్‎స్టా‎గ్రామ్‎లో పెట్టిన వీడియోలు వెంటనే తొలగించాలని విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ అల్టిమేటం జారీ చేసింది. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

అసలేం జరిగిందంటే..? 

నీట్ పేపర్ లీక్‎కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో సీజేపీ నిరసనలకు, నిరాహార దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌కు సంఘీభావంగా కొందరు ఐఐటీ మద్రాస్ విద్యార్థులు క్యాంపస్‌లో ఒక వీడియో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. నిరసనలకు అనుమతి నిరాకరించినప్పటికీ విద్యార్థులు క్యాంపస్‎లో సీజేపీ నిరసనలకు మద్దతుగా వీడియోలు చేయడంపై వర్శిటీ డీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇన్ స్టాలో వెంటనే ఆ వీడియాలు డిలీట్ చేయాలని విద్యార్థులను ఆదేశించారు. క్యాంపస్‎లో ఇటువంటి నిరసనల వల్ల కేంద్ర ప్రభుత్వంతో వర్శిటీకి ఉన్న సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్యాంపస్‎లో ఇలాంటి చర్యల వల్ల ఐఐటీ మద్రాస్ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. సామాజిక ఉద్యమాలు యువతను ఆకర్షించి ఆందోళనకు గురిచేస్తాయని, దీనివల్ల వారి చదువుపై ప్రభావం పడుతుందని యాజమాన్యం పేర్కొంది. 

ఐఐటీ మద్రాస్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ఆందోళన తెలుపుతోన్న విద్యార్థులకు సపోర్ట్ చేయడంలో తప్పేంటని ప్రశ్ని్స్తున్నారు. వర్శిటీ తీరు విద్యార్థుల భావప్రకటన స్వేచ్ఛ హక్కును హరిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.