వనపర్తి: యథేచ్ఛగా క్యాట్‌‌‌‌ఫిష్‌‌‌‌ పెంపకం..నిషేధమున్నా పట్టించుకోని పెంపకందారులు

వనపర్తి: యథేచ్ఛగా క్యాట్‌‌‌‌ఫిష్‌‌‌‌ పెంపకం..నిషేధమున్నా పట్టించుకోని పెంపకందారులు
  •     ఒక్క పెబ్బేరు మండలంలోనే పదుల సంఖ్యలో చేపల చెరువులు
  •     ఆంధ్ర ప్రాంతానికి సరఫరా

వనపర్తి/పెబ్బేరు, వెలుగు : ఆరోగ్యానికి హానికరమైన క్యాట్‌‌‌‌ఫిష్‌‌‌‌ పెంపకంపై నిషేధం ఉన్నప్పటికీ.. వనపర్తి జిల్లాలో మాత్రం  యథేచ్చగా కొనసాగుతోంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతమైన ఒక్క పెబ్బేరు మండలంలోనే 30కి పైగా క్యాట్‌‌‌‌ఫిష్‌‌‌‌ పెంపకం చెరువులు ఉండగా.. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, గద్వాల జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోనూ ఈ చేపల పెంపకం జోరుగా సాగుతోంది. మత్య్స శాఖ ఆఫీసర్లు గతంలో కొన్ని చేపల చెరువులను ధ్వంసం చేసి.. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. 

ఆహారంగా చికెన్‌‌‌‌ వేస్టేజీ..

వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, పెబ్బేరు మున్సిపాలిటీల పరిధిలోని చికెన్‌‌‌‌ సెంటర్ల నుంచి వేస్టేజీని సేకరించి ఈ క్యాట్‌‌‌‌ఫిష్‌‌‌‌లకు ఆహారంగా వాడుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రతి రోజు సుమారు 15 మెట్రిక్‌‌‌‌ టన్నుల వేస్టేజీని సేకరిస్తున్న టెండర్‌‌‌‌దారులు దానిని క్యాట్‌‌‌‌ఫిష్‌‌‌‌ పెంపకందారులకు అమ్మేస్తున్నారు. మామూలు దాణా కన్నా ఈ చికెన్‌‌‌‌ వేస్టేజీని తినడం వల్ల చేపలు తక్కువ కాలంలోనే ఎక్కువ బరువు పెరుగుతాయి. ఒక్క క్యాట్‌‌‌‌ఫిష్‌‌‌‌ తప్ప మిగతా చేపలేవీ చికెన్‌‌‌‌ వేస్టేజీని తినవు. అయితే చేపల చెరువుల వద్ద చికెన్‌‌‌‌ వేస్టేజీని డంప్‌‌‌‌ చేస్తుండడం వల్ల తీవ్ర దుర్వాసన వస్తోందని చుట్టుపక్కల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి సరఫరా...

వనపర్తి జిల్లాలో పెంచిన క్యాట్‌‌‌‌ఫిష్‌‌‌‌లను ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణం, రాయలసీమలోని పలు జిల్లాలతో పాటు బెంగళూరుకు సరఫరా చేస్తున్నారు. సాధారణ చేపలు కిలో రూ. 150 చొప్పున పలుకుతుండగా... క్యాట్‌‌‌‌ఫిష్‌‌‌‌ మాత్రం హోల్‌‌‌‌సేల్‌‌‌‌గానే కిలో రూ. 100కు పైగా పలుకుతోంది. దీని పెంపకం ఈజీగా ఉండడం, ఖర్చు సైతం తక్కువగా ఉండడంతో క్యాట్‌‌‌‌ఫిష్‌‌‌‌ను విచ్చలవిడిగా పెంచుతున్నారు. ఏపీకి చెందిన పలువురు చేపల వ్యాపారులు ఒక్క వనపర్తిలోనే పదుల సంఖ్యలో చేపల చెరువులను నిర్వహిస్తూ కోట్లలో సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఆఫీసర్లు స్పందించి క్యాట్‌‌‌‌ఫిష్‌‌‌‌ పెంపకాన్ని అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.