ఆర్టీఏ ఆఫీసుల్లో కరోనా దందా!

ఆర్టీఏ ఆఫీసుల్లో కరోనా దందా!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా కష్టకాలంలోనూ ఆర్టీఏ కార్యాలయాల్లో అక్రమ వసూళ్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. వాహనదారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. అది కూడా గతం కంటే అదనం. స్లాట్స్‌‌‌‌ సగానికి తగ్గించడంతో ఆదాయం తగ్గగా, అక్రమ వసూళ్ల రేటు పెంచేశారు. దీంతో  దళారులు సైతం అదనంగా తీసుకుంటున్నారు.

వసూళ్ల రేటు పెంచేశారు..

రాష్ట్ర వ్యాప్తంగా 56 ఆర్టీవో, యూనిట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు ప్రతిరోజు లెర్నింగ్‌‌‌‌, డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌, వెహికల్స్ రిజిస్ట్రేషన్‌‌‌‌, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సరిఫికెట్లు సహా వివిధ రకాల సేవల కోసం వేల సంఖ్యలో వాహనదారులు వస్తుంటారు. ప్రస్తుతం 59 సేవలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అందిస్తున్నారు. ఇందుకోసం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ–సేవా కేంద్రాల్లో స్లాట్‌‌‌‌ బుక్‌‌‌‌ చేసుకోవచ్చు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే ఫీజులు చెల్లించి తమకు కేటాయించిన తేదీల్లో సేవలు పొందొచ్చు. అయితే కరోనా కంటే ముందు డిమాండ్‌‌‌‌ను బట్టి ఒక్కో ఆఫీస్‌‌‌‌కు 600 వరకు స్లాట్స్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ లో పెట్టేవారు. అయితే ప్రస్తుతం ఫిజికల్‌‌‌‌ డిస్టేన్స్‌‌‌‌, కరోనా వ్యాప్తి తదితర కారణాలతో స్లాట్స్‌‌‌‌ తగ్గించారు. ప్రస్తుతం ఒక్కో కార్యాలయం పరిధిలో 300 స్లాట్స్‌‌‌‌ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఆదాయం రాకపోవడంతో అధికారులు, దళారులు తమ వసూళ్ల రేటును కూడా పెంచేశారు.

కరోనా టైంలో అదనంగా వసూలు..

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో సుమారు రెండు నెలలపాటు కార్యాలయాలు మూతబడ్డాయి. దీంతో అటు ఆర్టీఏకు, ఇటు అధికారులు, సిబ్బంది, దళారులకు పనిలేకుండా పోయింది. తిరిగి ప్రారంభించినా సగం స్లాట్స్‌‌‌‌ మాత్రమే ఓపెన్‌‌‌‌ చేస్తున్నారు. తక్కువ మంది వాహనదారులు వస్తుండటంతో వచ్చిన వారి నుంచే అక్రమ వసూళ్లు కానిచ్చేస్తున్నారు.  ఆర్టీఏలో సాధారణంగానే ప్రతి పనికి ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ రేట్‌‌‌‌ ఉంటుంది. కరోనా ముందు కంటే ఇప్పుడు 50శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు.. గతంలో టూవీలర్ లెర్నింగ్ లైసెన్స్‌‌‌‌కు సర్కార్‌‌‌‌ సర్వీస్ ఛార్జీ దాదాపు రూ.450 పోగా, అదనంగా రూ.400 వరకు అక్రమంగా తీసుకునేవారు. ఇప్పుడు సుమారుగా రూ.500 నుంచి రూ.600వరకు తీసుకుంటున్నారు. డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ రెన్యూవల్‌‌‌‌కు రూ.735 కాగా అదనంగా రూ. 400 వసూలు చేసేవారు. ఇప్పుడు ఇది కూడా రూ.600 దాకా వసూలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలోని ఒక్కో ఆఫీస్‌‌‌‌లో ఒక్కో విధంగా తీసుకుంటున్నారని వాహనదారులు చెబుతున్నారు.

క్యాబిన్లు దాటకుండనే సంతకాలు..

వాహనాల ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను పరిశీలించేందుకు ఎంవీఐలు నేరుగా వెళ్లి చెక్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఎంవీఐలు మాత్రం తమ క్యాబిన్‌‌‌‌ దాటకుండానే పనులు కానిస్తున్నారు. హోంగార్డులు, దళారులను రంగంలోకి దించి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. సాధారణంగా అన్నీ సక్రమంగా ఉంటేనే ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ ఇస్తారు. అయితే డూప్లికేట్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ ఉన్నా.. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ ఇస్తున్నారు.

కోడ్‌‌‌‌ భాషలు..

ఆర్టీఏ కార్యాలయాల్లో పనులన్నీ కోడ్‌‌‌‌ భాషల్లో నడుస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. దళారులతో వాహనదారులకు డీల్‌‌‌‌ కుదిరాక.. వారు తెచ్చిన పత్రాలపై పెన్సిల్‌‌‌‌ లేదంటే పెన్నుతో ఒక కోడ్‌‌‌‌ రాస్తారు. ఫలానా అధికారిని కలవాలని బ్రోకర్ చెబుతాడు. వాహనదారులు లోపలకు వెళ్లి సదరు ఉద్యోగిని కలిసిన వెంటనే కోడ్‌‌‌‌ చూసి పనిచేస్తాడు. ఇలా వచ్చే డబ్బులను బట్టి లోపల ఉన్న సిబ్బందికి కమీషన్ల రూపంలో కొంత మొత్తం దళారీ ముట్టజెబుతుంటాడు. ఆయా ఆఫీసుల్లో ఉండే జిరాక్స్ సెంటర్లు కూడా అక్రమ వసూళ్లకు అడ్డాలుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి.

దళారులదీ అదే సీన్‌‌‌‌..

ఆర్టీఏలో ఆన్‌‌‌‌లైన్ వ్యవస్థ వచ్చినప్పటికీ అనేక పనులకు ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ పట్ల చాలా మందిలో అవగాహన లేకపోవడం, ఎలా నమోదు చేసుకోవాలో తెలియకపోవడం, టైం లేక బిజీగా ఉండటం తదితర కారణాలతో అనేక మంది ఏజెంట్లను ఆశ్రయిస్తుంటారు. ఎవరైనా నేరుగా వచ్చినా.. ఏదో కారణం చెప్పి అప్లికేషన్‌‌‌‌ను పెండింగ్‌‌‌‌లో పెడతారు. లేకుంటే రిజెక్ట్‌‌‌‌ చేస్తారు. ఇక చేసేదేమీ లేక అనేక మంది బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. స్లాట్స్‌‌‌‌ తగ్గడంతో అధికారులు రేట్లు పెంచడంతో దళారులూ రేట్లు పెంచేశారు. బ్రోకర్లు ఒక్క డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ ఇప్పిండానికి ఒక్కో కస్టమర్‌‌‌‌ నుంచి రూ.4,000 నుంచి రూ.5,000 దాకా తీసుకుంటారు. ఇది కస్టమర్‌‌‌‌తో మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇందులో అధికారుల వాటాను వారికి అప్పజెబుతారు. ఇప్పుడు మరో రూ.500 వరకు అదనంగా తీసుకుంటున్నారు. ఇక అనేక ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులకు ప్రత్యేకంగా ఏజెంట్లు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.