చిత్రపురి కాలనీలో ఇళ్ల కూల్చివేత.. ఉద్రిక్తం

చిత్రపురి కాలనీలో ఇళ్ల కూల్చివేత.. ఉద్రిక్తం

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున.. సినీ ఇండస్ట్రీకి, ఆర్టిస్టులకు అడ్డా అయిన జూబ్లీహిల్స్ చిత్రపురి కాలనీలో ఇళ్లను కూల్చివేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా.. అక్రమంగా నిర్మించిన ఇళ్లను జేసీబీల సాయంతో పడగొడుతున్నారు అధికారులు. మే 12వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బంది జేసీబీలతో కాలనీలోకి వచ్చాయి. ఇళ్లను కూల్చివేస్తుండటంతో.. స్థానికులతోపాటు యజమానులు అడ్డుకున్నారు. అన్ని పర్మీషన్లు తీసుకునే నిర్మాణాలు చేపట్టామని వాగ్వాదానికి దిగారు.

స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు రావటంతో పోలీసుల సాయం తీసుకున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పర్మీషన్లు తీసుకోకుండా అడ్డగోలుగా.. ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టారని.. భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేసినట్లు వెల్లడించారు అధికారులు.  ఈ క్రమంలో అధికారులు... బిల్డర్ల మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, అధికారులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. వీటిలో చాలా వరకు 80, 90 శాతం నిర్మాణాలు  పూర్తయినవే ఉన్నాయి.