సంచిలో ఏంటా అని చూస్తే.. రెండు తలల పాములు.. రెండున్నయ్.. అమ్ముతూ దొరికిపోయారు..!

సంచిలో ఏంటా అని చూస్తే.. రెండు తలల పాములు.. రెండున్నయ్.. అమ్ముతూ దొరికిపోయారు..!

వరంగల్‌: వరంగల్‌లో రెండు తలల పాము (రెడ్ శాండ్ బోవా పాములు) అక్రమ రవాణాను DRI (Directorate of Revenue Intelligence) HZU (Hyderabad Zonal Unit) పోలీసులు.. అండర్‌ కవర్ డెకాయ్ ఆపరేషన్ చేసి అడ్డుకున్నారు. గ్రే మార్కెట్‌లో పాముల విక్రయానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అనుమానితుడి బ్యాగ్‌లో రెండు బతికే ఉన్న ఇండియన్ రెడ్ శాండ్ బోవా పాములను స్వాధీనం చేసుకున్నారు. రెడ్ శాండ్ బోవా పాము.. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 షెడ్యూల్-I జాబితాలో ఉన్న అరుదైన జాతి. ఈ జాతి పాముల కొనుగోలు, విక్రయం, కలిగి ఉండటం చట్ట విరుద్ధం.

స్వాధీనం చేసిన పాములు, ప్యాకింగ్ మెటీరియల్ ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు తదుపరి విచారణ చేస్తారని పోలీసులు తెలిపారు. రెండు తలల పామును ఇంట్లో పెట్టుకుంటే అదృష్టమని, కుభేరులు అవుతారని కొందరు నమ్ముతారు. అలాగే ఎయిడ్స్‌ నివారణకు మందుల తయారీలో వినియోగిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.

రెండు తలల పామును ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ వస్తుందన్న మూఢనమ్మకాలతో కొనుగోలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. రెండు తలల పాము ఇంట్లో ఉంటే కుబేరులవుతారన్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. పాముల స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తెలిస్తే  సమాచారం ఇవ్వాలని కోరారు. 

అంతరించిపోతున్న పాముల్లో రెండు తలల పాము ఒక రకమైందని...అన్ని పాముల్లాగ  ఎక్కువగా కనిపించకపోవడంతో క్యాష్ చేసుకునేందుకు వీటిని పట్టుకొచ్చి  అమ్ముతున్నారని తెలిపారు. కష్టపడితేనే జీవితంలో పైకొస్తారని.. ఇలాంటి మూఢనమ్మకాలతో ఎలాంటి లాభం ఉండదన్న విషయాన్ని ప్రజలు ఇకనైనా గుర్తించాలని పోలీసులు సూచించారు.