మహారాష్ట్రకు తెలంగాణ లిక్కర్..  ప్రాణహిత మీదుగా నాటు పడవల్లో తరలింపు 

మహారాష్ట్రకు తెలంగాణ లిక్కర్..  ప్రాణహిత మీదుగా నాటు పడవల్లో తరలింపు 
  •     అక్రమ దందాలో అధికార పార్టీ నేత
  •     పట్టించుకోని అధికారులు

మంచిర్యాల, వెలుగు : తెలంగాణ లిక్కర్ పట్టపగలే మహారాష్ట్రకు తరలుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని వైన్స్ నుంచి యథేచ్ఛగా రవాణా అవుతోంది. సరిహద్దుల్లోని ప్రాణహిత నది వరకు ఎడ్ల బండ్లు, ఆటోల్లో పెద్ద ఎత్తున లిక్కర్ తీసుకెళ్లి అక్కడి నుంచి నాటు పడవల ద్వారా నది అవతలికి దాటిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన అధికార బీఆర్​ఎస్​పార్టీ లీడర్ల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతోంది. కోటపల్లి మండలానికి చెందిన ఓ లీడర్​ మద్యం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గంలో లిక్కర్ దందా ఆయన కనుసన్నల్లోనే నడుస్తుండడం దీనికి బలం చేకూరుస్తోంది.

ALSO READ: కర్నల్ మన్‌‌ప్రీత్ సింగ్‌‌కు కన్నీటి వీడ్కోలు

మహారాష్ట్రలోని గడ్చిరోలి ఆదివాసి జిల్లా. అక్కడ మద్య నిషేధం అమలులో ఉంది. దీంతో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున సిరొంచ తాలూకాలోని గ్రామాలకు సప్లయ్​చేస్తున్నారు. ఒక్కో బాటిల్ పై రూ.50 నుంచి రూ.100కు అదనంగా అమ్మతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ఆదాయంపైనే ప్రధానంగా ఆధారపడింది. ఎక్సైజ్ అధికారులకు నెలనెలా టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. దీంతో ఆ శాఖ అధికారులు సైతం అక్రమ మద్యం వ్యవహారంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ లీడర్లు కావడంతో పోలీసులు సైతం పట్టించుకోవడం లేదు.